CM Jagan: ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో కులం లేదట. మతం లేదట. ఉన్నదల్లా వర్గమేనట. ఇన్ని సిద్ధాంతాలు వల్లెవేస్తున్న ఆయన కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడనుకునేరు. కానేకాదు. ఆయనో ఫక్తు బూర్జువా పార్టీకి అధినేత. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యధినేత. బడా పెట్టుబడిదారుడు. మరి ఆయన వర్గ స్వభావానికి భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారేంటి అనుకుంటున్నారా ? అవును. పొంతనలేని ఆయన మాటలతో జనం తికమకపడుతున్నారు. కమ్యూనిస్టులు కూడా ఇంత చక్కగా మాట్లాడరేమో అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కమ్యూనిస్టులు ఏమైనా ఆవహించారా ? అన్న ప్రశ్న పుట్టక మానదు. ఎందుకంటే ఇటీవల ఆయన మాటలు అలా ఉన్నాయి. అచ్చు కమ్యూనిస్టు నేతల ప్రసంగాల్లా అనిపిస్తాయి. కులం, మతం, వర్గం అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. ఏపీలో కులంలేదని, మతంలేదని, ఉన్నదల్లా వర్గమేనని చెబుతున్నారు. తాను పేదల వైపు ఉంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ధనికుల వైపు నిలబడ్డారని దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. కమ్యూనిస్టు పరిభాషలో వర్గం అంటే ఉన్నవారు .. లేనివారు అని అర్థం. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ ఏ వర్గానికి చెందుతారో ఆయనకే తెలియాలి.
రెండు పరస్పర విరుద్ధమైన పదాల కలయికను ఇంగ్లీషులో ఆక్సీమోరాన్ అంటారు. ఇప్పుడు జగన్ మాట్లాడుతున్న మాటలు కూడా అలానే ఉన్నాయి. ఆయనేమో దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రం దేశంలోనే పేద రాష్ట్రం. ఆయన సంపద దేశంలోని ముఖ్యమంత్రులందరి కంటే అధికం. ఇంతటి ధనిక ముఖ్యమంత్రి తాను పేదలవర్గం అని చెప్పడం ఎంత విడ్డూరం. ఏదైనా చెబితే వినడానికి కూడా వినసొంపుగా ఉండాలి. మాట మట్లాడితే నమ్మేలా ఉండాలి. అంతేకానీ నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగితే జనం చూస్తూ ఊరుకుంటారా ?. ఓటుతో బుద్ధి చెప్పరూ.

భూమి నుంచి ఇసుక వరకు, మైన్స్ నుంచి లిక్కర్ వరకు, అడవుల నుంచి కొండల వరకు, పేపర్ నుంచి ఎర్రచందనం వరకు అన్ని వనరులూ ముఖ్యమంత్రి కబంధహస్తాల్లో ఉన్నాయి. అధికార పదవుల్లో ఒకే కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈయన వర్గం గురించి మాట్లాడితే నవ్విపోదురు. జగన్ ఓ పెట్టుబడిదారుడు, స్వతహాగా వ్యాపారవేత్త.. అయినా ఏపీకి పెట్టుబడిదారులు, పరిశ్రమలు రావాలంటే బెదిరిపోతున్నారు. పెట్టుబడులు రాకుండా ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు ? పన్నుల ఆదాయం ఎలా వస్తుంది ? సంపద సృష్టి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి అవసరం లేదా ? ఎంతసేపు మధ్యతరగతి ప్రజలను పన్నుల పేరుతో పీల్చడమే పరిపాలనా ?. ఉపాధి లేక పేదలు వలసపోతున్నారు. మధ్యతరగతి జనం పన్నుల బాదుడుతో విలవిలడాతున్నారు. రైతులు ప్రభుత్వం సాయం లేక, గిట్టుబాటు ధరలేక వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మరి ఇంత మంది జనం ఇబ్బందిపడుతుంటే జగన్ ఏ వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు.
జగన్ వర్గం గురించి మాట్లాడటం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇంతటి ధనిక ముఖ్యమంత్రి పాలనలో ఏపీ ఎందుకు పేద రాష్ట్రంగా ఉందంటూ ప్రశ్నించారు. అన్ని వనరుల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను బానిసలుగా చేసుకుని పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వర్గం గురించి మట్లాడటం ఏంటని ఎద్దేవా చేశారు. అరకులో బాక్సైట్ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్న ధనిక ముఖ్యమంత్రి.. కాకలుతీరని కమ్యూనిస్టులు చారుమజుందార్, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెలనాగిరెడ్డిలాగా వర్గ సిద్ధాంతం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
జగన్ మాటలు వింటే ఎవరికైనా నవ్వు రాకమానదు. పొంతనలేని మాటలతో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారు. ఫలితాన్ని సాధించారు. ఇప్పుడు ఆ నినాదాలతో అవసరం తీరిపోయింది. అందుకే వర్గం .. పేద, ధనిక అంటూ కొత్త రాగం అందుకున్నారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన తాను పేద వర్గాలకు అండగా ఉంటానని చెబుతున్నారు. ఎలుకలకు పిల్లి రక్షణగా ఉంటానని చెప్పినట్టు ఉంది జగన్ మాటలు వింటుంటే.