Indian Cricketers Prayed: టీమ్‌ఇండియా వర్ధమాన క్రికెటర్ రిషబ్‌పంత్ గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో వేగంగా కోలుకుంటున్నాడు. రిషబ్ వేగంగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లంతా భగవంతుడిని ప్రార్థించారు. తోటి ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మూడో వండే కోసం మధ్యప్రదేశ్‌కు..
న్యూజిలాండ్‌తో మూడో వన్డే నిమిత్తం టీమ్ ఇండియా జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్, కుల్‌దీప్, సుందర్‌తో పాటు భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడికి భస్మా హారతి సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ ‘రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని మేం ఆ భగవంతుడిని ప్రార్థించాం. అతడు జట్టులోకి తిరిగిరావడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం’ అని తెలిపాడు.
తొలిసారి ఇలా..
సహచర క్రికెటర్ కోసం టీం ఇండియా సభ్యులంతా కలిసి పూజలు చేయడం బహుషా ఇదే తొలిసారని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఉజ్జయినిలో రిషబ్ కోసం పూజలు చేసిన క్రికెటర్లను అభినందిస్తున్నారు. జట్లు కలిసి కట్టుగా ఉంటే విజయం సాధిస్తుందని, కలిసి ప్రార్థించిన క్రికెటర్ల విషెస్‌తో రిషబ్ మరింత త్వరగా కోలుకుంటాడని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తాం..
ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌పై కూడా ఆయన మాట్లాడారు. తాము ఇప్పటికే సిరీస్ గెలిచామన్నారు. మూడో వన్డేలో గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇండోర్ వేదికగా మంగళవారం భారత్ న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే జరుగనుంది.