India vs New Zealand 3rd T20: ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా? పోకిరిలో ఈ డైలాగ్ ను బుధవారం టీమిండియా ఓపెనర్ గిల్ బౌలర్ ఎవరన్నది కాదన్నయ్య బంతి స్టాండ్స్ లోకి వెళ్లిందా లేదా? అన్నట్టుగా మార్చాడు.. తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.. 63 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 126 పరుగులు చేశాడు.. మొత్తానికి అహ్మదాబాద్ స్టేడియాన్ని మోతెక్కించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగింది. లక్నోలో తమకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్ బౌలర్లకు.. తమ బ్యాటింగ్ ఎలా ఉంటుందో రుచి చూపింది. ఏడు పరుగులకే ఇషాన్ వికెట్ కోల్పోయినప్పటికీ భారత బ్యాట్స్మెన్ పెద్దగా ఇబ్బంది పడలేదు.. గిల్, రాహుల్ త్రిపాఠి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 8.2 ఓవర్లలో ఇండియా స్కోర్ ను 87 పరుగుల దాకా తీసుకొచ్చారు.. ముఖ్యంగా గిల్, రాహుల్ న్యూజిలాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు.. వ్యక్తిగత స్కోరు 44 (రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగుల వద్ద ఇష్ సోది బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి త్రిపాఠి అవుట్ అయ్యాడు . ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కుమార్ యాదవ్ 24(13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు) పరుగులు చేశాడు.. వేగంగా ఆడే క్రమంలో టిక్నర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా, గిల్ కు చక్కని సహకారం అందించాడు వీరిద్దరూ నాల్గో వికెట్ కు 103 పరుగులు జోడించారు.. ముఖ్యంగా గిల్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఇతడిని ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించాల్సి వచ్చింది.. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.. ముఖ్యంగా లిస్టర్, ఫెర్గు సన్, టిక్నర్ బౌలింగ్ ను గిల్ ఊచ కోత కోశాడు.. చివరి ఏడు ఓవర్లలో (20 ఓవర్ వినహయించి) భారత జట్టు 12 రన్ రేటుతో పరుగులు సాధించింది.. దీంతో భారత జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

గిల్ తుఫాన్ ఇన్నింగ్స్
ఓపెనర్ గా బరిలోకి వచ్చిన గిల్… మొదట ఆచితూచి ఆడాడు.. కానీ ఎప్పుడైతే ఆఫ్ సెంచరీకి చేరువుగా వచ్చాడో అప్పుడే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదటి రెండు టి20లో విఫలమైన అతడు… ఈ మ్యాచ్లో కసి తీరా ఆడాడు.. ఫోర్లు, సిక్సర్లు మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టాడు. మన కెరియర్లో తొలి టీ20 సెంచరీ నమోదు చేశాడు.. భారత్ తరఫున టి20 లో సెంచరీలు సాధించిన ఐదు బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.. ఇంతకుముందు ఇదే గిల్ హైదరాబాదులో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.