YS Sharmila slams Chandrababu: రాష్ట్రంలో జనాభా సంఖ్య పెంచేందుకు చంద్రబాబు కీలక ప్రకటనలు చేస్తున్నారు. అందులో భాగంగా పిల్లలను కనాలని సూచిస్తున్నారు. మూడో బిడ్డను కంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ సాయం చేస్తామని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ప్రకటనలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. సెటైరికల్ కామెంట్స్ చేశారు. మూడో బిడ్డను కంటే వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవారు ఎవరు అని ప్రశ్నించారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు కోతకు గురవుతున్నాయని.. ఇప్పుడు అదనంగా బిడ్డలను కంటే వారికి బకాయిలు పెడతారా అని చంద్రబాబును నిలదీసినంత పనిచేశారు షర్మిల. షర్మిల కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం దయనీయంగా ఉంటే ఈ ప్రకటనలు ఏంటని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్ర పరిస్థితిపై ఆవేదన..
తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటనపై స్పందించారు షర్మిల. మన రాష్ట్రం ఎంతో దయనీయమైన స్థితిలో ఉందో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు రాజధానులు ఉంటే.. ఏపీకి కనీసం రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు చేతిలో ఉంది చిప్ప తప్ప మరి ఏంటని ప్రశ్నించారు. మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలని… డిగ్రీలు, పీజీలు చేసిన బిడ్డలంతా రోడ్లపై తిరుగుతున్నారని.. ఆటో డ్రైవర్లుగా.. గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో పిల్లలను కనాలని కోరడం సబబేనా అని ప్రశ్నించారు.
బకాయిల మాటేంటి?
ముగ్గురు, నలుగురు, ఐదుగురు బిడ్డలను కనాలంటున్నారని.. అలా కన్నవారికి 25 వేలు ఇస్తానంటున్నారని… బోడి మీరిచ్చే పాతిక వేలకు మీరు బిడ్డలను కనాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్ల బకాయిలు.. ఫీజు రియంబర్స్మెంట్కు 6000 కోట్లు బకాయిలు పెట్టిన విషయం గుర్తు లేదా అంటూ నిలదీశారు. కరెంటు చార్జీలు సైతం 17 వేల కోట్లు పెంచారని చెప్పుకొచ్చారు. పాలనను గాడిలో పెట్టాలి తప్ప.. ఇలా పిల్లలను కనాలని పిలుపునివ్వడం ఏమిటని సెటైరికల్ గా మాట్లాడారు షర్మిల.