
India vs Australia- Shubman Gill: యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. ఈ సెంచరీతోనే ఒక అరుదైన రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో గిల్ సెంచరీతో చెలరేగాడు. 194 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో గిల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సెంచరీతో అరుదైన రికార్డును గిల్ తన పేరిట లిఖించుకున్నాడు. అలాంటి రికార్డును భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ముగ్గురే సాధించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి హేమాహేమీలకు సైతం సాధ్యం కానీ రికార్డను ఈ రోజు సాధించిన.. ఆ మగ్గురి క్రికెటర్ల సరసన ఇప్పుడు గిల్ నిలిచాడు.
ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ..
భారత క్రికెటర్ ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా శుబ్‌మన్ గిల్ చరిత్రలోకి ఎక్కాడు. గిల్ కంటే ముందు రోహిత్‌శర్మ, సురేష్ రైనా, కేఎల్.రాహుల్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అందుకే రోహిత్, రైనా, రాహుల్.. ఈ ఆర్‌ఆర్‌ఆర్ త్రయం తర్వాత గిల్ నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
నిలకడగా ఆసీస్ బ్యాటింగ్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా- ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే తొలి రోజు 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రెండో రోజు లంచ్ వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడింది. ఈ క్రమంలో తొలి రోజే సెంచరీతో అదరగొట్టిన ఉస్మాన్ ఖవాజా.. రెండో రోజు డబుల్ సెంచరీ చేయడమే ధ్యేయంగా ఆడాడు. కానీ.. 180 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అతనితో ఆపటు యువ క్రికెటర్ కామెరున్ గ్రీన్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఖవాజా-గ్రీన్ మధ్య 200 పైచిలుకు పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. లంచ్ తర్వాత కామెరున్ గ్రీన్ అనవసరపు షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్న తర్వాత.. టీమిండియా బౌలర్లు చెలరేగి ఆస్ట్రేలియాను ఆలౌట్ చేశారు.

రాణించిన రవిచంద్రన్..
ముఖ్యంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లతో రాణించాడు. మొత్తం మీద ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 6, షమీ 2 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఆసీస్‌ను చివరి సెషన్‌లో ఆలౌట్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్..70 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 112, విరాట్ కోహ్లీ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా 42 పరుగులుచేసి అవుట్ అయ్యాడు.
