Instagram: స్మార్ట్ ఫోన్ చేతికొచ్చిన తర్వాత సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్.. ఇలా అనేక సామాజిక మాధ్యమాలలో యువత ఖాతాలు ప్రారంభించి.. వాటి ద్వారా తమ స్నేహితులకు, సన్నిహితులకు టచ్ లో ఉంటున్నారు. మంచి వెనకే చెడు ఉన్నట్టు.. ఈ సామాజిక మాధ్యమాల ముసుగులో కొంతమంది పోకిరీ లు అమ్మాయిలను వేధిస్తున్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి అమ్మాయిలకు దగ్గరయి.. తర్వాత అసలు రూపం బయటపెడుతున్నారు.. అమ్మాయిల అసభ్య ఫోటోలు సేకరించి బ్లాక్ మెయిలింగ్ కు పడుతున్నారు. అలాంటి ఘటన హైదరాబాదులో జరిగింది.
ఢిల్లీకి చెందిన ఓ 29 సంవత్సరాల యువకుడు సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటాడు. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో అతడు నకిలీ ఐడీలు సృష్టించి అందమైన అమ్మాయిలకు రిక్వెస్ట్లు పంపేవాడు. వారు యాక్సెప్ట్ చేయగానే చాట్ చేసేవాడు. (ఆ అమ్మాయిలు కూడా తమతో చాట్ చేస్తోంది ఓ యువతే అనుకునే వారు.) అలా వారి ఫోన్ నెంబర్లు సేకరించి వ్యక్తిగతమైన ఫోటోలు పంపమని కోరేవాడు.. దీంతో వారు అలానే పంపేవారు. ఇలా చాలామంది అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని బెదిరించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేస్తానని భయ పెట్టేవాడు. దీంతో భయపడిన వారు అతడు చెప్పినట్టే చేసేవారు.
ఇటీవల ఓ అమ్మాయిని ఇలానే మాటల్లో పెట్టి ఆమె నగ్న చిత్రాలు సేకరించాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట బెదిరిపోయిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత ఆ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమకున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ ఐడీలు సృష్టించిన వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కొన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో చాలామంది అమ్మాయిల నగ్న చిత్రాలు ఉండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ యువకుడిది ఢిల్లీ అని, అతడికి 29 సంవత్సరాల వయసు ఉంటుందని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. సామాజిక మాధ్యమాలను వాడే యువతీ యువకులు ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి రిక్వెస్ట్ లు వస్తే యాక్సెప్ట్ చేయవద్దని సూచించారు. వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, వ్యక్తిగతమైన ఫోటోలు పంపకపోవడమే మంచిదని వివరించారు. కాగా, ఆ యువకుడు పనీపాటా లేకుండా ఆవారాగా తిరుగుతుంటాడని పోలీసుల విచారణలో తేలింది.