DK Shivakumar :ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. కర్ణాటక , తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ గెలుస్తుందని.. అందులో కాంగ్రెస్ పార్టీకి సింహభాగం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు రాలేదు. పైగా ఈసారి సింగిల్ డిజిట్ స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. ఒకరకంగా ఆ పార్టీ అగ్రనాయకత్వానికి బీహార్ ఎన్నికలు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించాయి.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.. కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే కొంతకాలంగా ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య సిద్ధరామయ్య ఓ భూ కుంభకోణంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై రకరకాల ఆరోపణలు వినిపించాయి. అయితే దీనిపై ఇప్పటికి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగానే సీతారామయ్య ను మార్చుతారని.. ఆయన స్థానంలో డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రచారం మొదలైంది. అయితే నిన్నటి వరకు ఇది మీడియాలో ప్రచారంగా మాత్రమే ఉండేది. ఉన్నట్టుండి కర్ణాటక రాష్ట్రంలో ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చుట్టూ అక్కడి రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నర సంవత్సరాలు అవుతోంది. ఈ క్రమంలో పవర్ షేరింగ్ కోసం అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడానికి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో, గురువారం తీసి వేణుగోపాల్ తో డీకే ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అవతారని తెలుస్తోంది. జాతీయ మీడియాలో ప్రధానంగా ఈ వార్తలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో కచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలపై డీకే వర్గం ఇంతవరకు నోరు మెదపలేదు. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని అధిష్టానం నిర్మించినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి కూడా శివకుమారే ప్రధాన కారణం. అయితే అధిష్టానంలో కొంతమంది వ్యక్తులు సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉండడంతో శివకుమార్ కు దక్కాల్సిన ముఖ్యమంత్రి పీఠం సిద్ధ రామయ్యకు సొంతమైంది. అయితే అప్పట్లో పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అందువల్లే డీకే శివకుమార్ ఆ విషయాన్ని గుర్తు చేయడానికి ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.