Chandrika Ravi: వీరసింహారెడ్డి విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ గట్టిగా నిర్వహిస్తున్నారు. థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. వీరసింహారెడ్డి చిత్రంలో కూడా హాట్ ఐటెం నెంబర్ ఉంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అనే ఈ ఐటెం సాంగ్ లో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్స్ తో ఆడిపాడారు. థమన్ ట్యూన్ ఆకట్టుకోగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరోసారి మెప్పించింది. ఐటెం భామలుగా హనీ రోజ్, చంద్రిక రవి ఈ పాటలో బాలయ్యతో కాలు కదిపారు. వారిద్దరి గ్లామర్, బాలయ్య స్టెప్స్ సాంగ్ లో హైలెట్ గా నిలిచాయి.

కాగా ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ సాంగ్ లో నటించిన చంద్రిక రవి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సాంగ్ షూట్ లో తాను నడుము నొప్పితో బాధపడ్డారట. సాంగ్ షూట్ చివరి రోజు నడుము బెణికిందట. దాంతో విపరీతమైన నొప్పి వచ్చిందట. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా నొప్పితోనే బాలయ్య పక్కన డాన్స్ చేసిందట. బాలయ్య లాంటి స్టార్ హీరోతో చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అందుకే ఆ అరుదైన అవవకాశాన్ని నొప్పి కారణంగా వదులుకోవాలని అనిపించలేదు. అందుకే… నొప్పిని భరిస్తూ సాంగ్ పూర్తి చేశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా చంద్రిక రవి బాలయ్యపై ప్రశంసలు కురిపించారు. ఈ సాంగ్ నా జీవితాన్నే మార్చేసింది. ఈ గొప్ప అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా బాలకృష్ణ గారి వలనే సాధ్యమైంది. ఈ సాంగ్ లో చేయడం అదృష్టంగా భావిస్తాను. ఇంత త్వరగా నాకు పెద్ద అవకాశం వస్తుందని ఊహించలేదు, అని చంద్రిక రవి తన సంతోషం మీడియాతో పంచుకున్నారు.

ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రిక రవి మోడలింగ్ చేయడానికి లాస్ ఏంజెల్స్ వెళ్లారు. అనంతరం ఇండియా వచ్చి యాక్ట్రెస్ గా మారారు. తమిళ చిత్రం ‘ఇరుత్తు అరైయిల్ మురట్టు కుత్తు’ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఆ మూవీలో ఆమెది క్యామియో రోల్. ఆ చిత్ర తెలుగు రీమేక్ ‘చీకటి గదిలో చిలక్కొట్టుడు’ మూవీలో కూడా చంద్రిక రవి నటించారు. మరో రెండు తమిళ చిత్రాల్లో నటించిన చంద్రిక రవి ‘బాలీవుడ్ టు హాలీవుడ్’ పేరుతో ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు.