Homeఆంధ్రప్రదేశ్‌AP politics: ఏపీలో ఈ చీప్ పాలిటిక్స్ ఎన్నాళ్లు..

AP politics: ఏపీలో ఈ చీప్ పాలిటిక్స్ ఎన్నాళ్లు..

AP politics
AP politics

AP politics: అబద్ధాలను పదేపదే చెప్పడం ద్వారా నిజం చేయవచ్చన్న ఫార్ములాను వైసీపీ ఒంటపట్టించుకుంది. అదో సక్సెస్ మంత్రంగా మార్చుకుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ విపక్ష పాత్ర పోషించిందా? అంటే అదీ లేదు. అసలు శాసనసభనే బాయ్ కట్ చేసింది. ప్రజా సమస్యలపై కంటే ప్రభుత్వంపై విష ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. మూడు నెలల్లో పట్టిసీమను కట్టి నదుల అనుసంధానం చేస్తే దానిపై కట్టుకథలు అల్లారు. గోదావరి జిల్లాల ప్రజలకు నీళ్లు లేకుండా కృష్ణాకు తరలిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కడా లేని అవినీతి జరిగిందని ఆరోపించారు. డీఎస్పీల బదిలీల్లో కమ్మలకు తప్పించి ఇతర కులాలకు ప్రాతినిధ్యం లేదంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. అయితే వీటిని ప్రజలు నమ్మకపోయినా.. పదేపదే ప్రచారం చేయడం వల్ల అబద్ధాలు కూడా నిజంగా భావించాల్సి వచ్చింది. ఢిల్లీలో ఏకంగా ఈసీ ఆఫీసు ముందే విలేఖర్ల సమావేశం నిర్వహించి డీఎస్పీలంతా కమ్మ బ్యాచ్ అని ప్రకటించం టెంపరితనమే అవుతోంది. దానికి సోషల్ మీడియా, నీలిమీడియాతో విస్తృత ప్రచారం కల్పించి.. ప్రజల్లో భ్రమలు కల్పించి రాజకీయ లబ్ధిపొందడంలో వైసీపీ సక్సెస్ మంత్ర పనిచేసింది.

వివేకా హత్యకేసులో..
కాలగమనంలో ఒక నాలుగేళ్లు వెనక్కి వెళదాం. 2019 మార్చి 15న ఉదయం 7 గంటల సమయంలో ఒకసారి పులివెందులలో జరిగిన ఎపిసోడ్ గమనిద్దాం. తొలుత వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారు అని మీడియాకు లీకులిచ్చారు. అక్కడ కొద్దిసేపటి తరువాత కాదుకాదు వివేకాది హత్య అని… గొడ్డలితో వేటు వేశారంటూ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇది నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షిలో కథనాలు వండి వార్చారు. సీఐడీ దర్యాప్తు వద్దు.. సీబీఐ కావాలని డిమాండ్ చేశారు. అక్కడకు కొద్దినెలలకు అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే వివేకా కుమార్తె సునీత పోరాటంతో సీబీఐ దర్యాప్తు కొనసాగింది. ఈ నాలుగేళ్ల సీబీఐ విచారణలో చిత్రవిచిత్రాలు, ట్విస్టులు కొనసాగాయి. చివరకు ఢిల్లీ పెద్దల సహాయ నిరాకరణతో పాటు కేసు విచారణ తుది దశకు రావడంతో కలవరపాటుకు గురవుతున్నారు. ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇన్నాళ్లూ కళ్ల ముందు కనిపించే వాటిని కూడా అబద్దం అని వాదించారు.. నమ్మించారు అన్నమాట. తాము ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే ప్రజలు ఉన్నారు కదా అనే ధైర్యంతో… ఓ అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ ఫార్ములా ఎవరూ ఊహించనంత రేంజ్‌కు చేరి ఇప్పుడు వివేకా హత్య కేసులో వికటించింది. వారి అంచనాలు తలకిందులయ్యాయి.

అంతా రివర్స్
టీడీపీ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేసిందని చెప్పలేం. కానీ చాలా వరకూ అందులో మంచి పనులు ఉన్నాయి. కానీ అవన్నీ ప్రజల చెవికి ఎక్కలేదు. ఇలా అనేదానికంటే ఎక్కించలేదు. చంద్రబాబు ఏ పనిచేసినా ప్రజల్లో విషం ఎక్కించారు. చివరకు అమరావతి రాజధాని విషయంలో సైతం అదే కుట్రను కొనసాగించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారు. అమరావతిపై కుల ముద్ర వేసి.. ప్రజల్ని నిట్ట నిలువునా చీల్చేసిన ఘనత కూడా వైసీపీదే. పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగుపెడుతుంటే ఏపీలో మాత్రం పగ, ప్రతీకారాలు, రివర్స్ టెండరింగ్ లతో రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీశారు. పోలవరంపై అవే అబద్ధాలను ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏంచేశారు. నాలుగేళ్లలో ప్రాజెక్టును ఏ స్థాయిలో పడుకోబెట్టారో కళ్ల ముందు సాక్షాత్కరించి చూశారు. పోలవరం గేట్లు ఎత్తు తగ్గిస్తామంటే సైలెంట్ అయ్యారు. జాతీయ ప్రాజెక్టు అంశం మరుగున పడినా మిన్నకుండా ఉన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏ అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించారో.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే ఫార్ములాను అనుసరించి చూపుతున్నారు. ప్రజలకు కూడా అవాస్తవ ప్రచారాలకు అతిగా నమ్ముతున్నారు. ఇప్పటికీ సమిధలుగా మారతున్నారు.

కోడికత్తి కేసులో సైతం..
కోడికత్తి కేసులో కూడా అవే డ్రామాలు. అంతుపట్టని ట్విస్టులు. దాడి జరిగింది విశాఖ ఎయిర్ పోర్టులో. దాడిచేసింది శ్రీనివాసరావు అనే యువకుడు. అసలు ఈ కేసులో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు లేవు. కోడికత్తితో దాడి జరిగిందన్నారు. చొక్కాకు రక్తం అంటిదన్నారు. హైదరాబాద్ వెళ్లి ఐసీయీలో చేరి మూడు వారాలు పక్కాగా డ్రామా ఆడారు. ఇందులోనూ అబద్దాలే. చివరికి ఎన్ఐఏ దర్యాప్తునూ వేయించుకున్నారు. పట్టుబట్టి వేయించుకున్న ఎన్ఐఏ దర్యాప్తును సైతం తప్పుపడుతున్నారు. తాము చెప్పినట్టు కుట్ర కోణం అని ప్రకటించకపోయేసరికి చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని కొత్త పల్లవి అందుకున్నారు. తాను జగన్ భక్తుడినని.. ఎన్నికల్లో ఆయనకు సింపతీ కోసమే అన్ని జాగ్రత్తలు తీసుకొని కోడికత్తితో దాడిచేశానని స్వయంగా నిందితుడే చెబుతున్నా వినలేదు. నాలుగేళ్లుగా బెయిల్ రాకుండా జైలుకే పరిమితం చేశారు. దేశ నాయకులను హత్యచేసిన వారిని బెయిల్ ఇచ్చిన ఈరోజుల్లో చిన్న కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావుకు మాత్రం బెయిల్ రాకుండా చేస్తున్నారు. మరింత లోతైన దర్యాప్తు కావాలంటూ కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు.

AP politics
AP politics

అన్నీ ఉన్నా ఒంటరివాడనని..
ఈ అబద్ధం అన్న ప్రచారానికి ఆరితేరిన జగన్ తాను ఒంటరివాడినంటూ ప్రజల ముందు మాట్లాడతారు. తనకు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా లేవని నమ్మబలుకుతున్నారు. సాక్షి పత్రిక ఉంది. సాక్షి చానల్ ఉంది. పదివేల మంది సోషల్ మీడియా సైన్యం ఉన్నారు. పైగా అంతులేని మెజార్టీతో నమ్మకమైన పార్టీ శ్రేణులతో ఓ రాక్షస సైన్యాన్నే ఏర్పాటుచేసుకున్నారు. అయినా తాను ఒంటరినని మాత్రమే ప్రజల ముందు అబద్ధమాడుతున్నారు. ప్రజల్లో భ్రమలను కల్పిస్తున్నారు. అయితే మెజార్టీ వర్గం నమ్మకపోయినా.. ఇంకా ఈ అబద్ధాన్నే నిజమనుకునే జనం ఏపీ సమాజంలో మిగిలి ఉన్నారు. అందుకే అబద్ధపు ప్రచారాన్ని చేసుకొని మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అబద్ధాలను జనం గ్రహించిన నాడు గతంలో జరిగిన తప్పిదాలు, తప్పులు పునరావృతమయ్యే చాన్స్ లేదు. ప్రజలు నిజాలు తెలుసుకుంటే మాత్రం ఇటువంటి బలవంతపు అబద్ధాలు, ప్రచారాలకు తెరపడుతుంది. లేకుంటే యధా రాజా.. తధా ప్రజాయే…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version