
Apple Store: యాపిల్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడమే ఆలస్యం వెంటనే యాపిల్ స్టోర్ ముందు వాలిపోతారు. ధర ఎంతైనా సరే పెట్టి కొనుగోలు చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు.. డబ్బులు పెట్టి కొనకుండా యాపిల్ ఫోన్ సొంతం చేసుకుంటారు. అదేంటి డబ్బులు పెట్టకుండా ఈ యాపిల్ ఫోన్ ఎలా వస్తుంది. అని ఆశ్చర్యపోకండి? అలా ఎలా సాధ్యమవుతుందని అని అడగకండి? కొంతమంది యాపిల్ ఫోన్ డబ్బులు పోసి కొంటే.. మరి కొంతమంది తమ హస్త లాగవాన్ని ప్రదర్శించి యాపిల్ ఫోన్ సొంతం చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ చోరీకి గురవుతున్న ఫోన్ బ్రాండ్లలో యాపిల్ మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు చోరీ జరుగుతున్న స్టోర్ లలోనూ యాపిల్ ప్రథమ స్థానంలో ఉంది.. అమెరికా నుంచి నైజీరియా వరకు అంతటా ఇదే పరిస్థితి. ఎందుకంటే యాపిల్ కు ఉన్న క్రేజ్ అటువంటిది.. ఇక యాపిల్ పుట్టిన దేశంలో.. యాపిల్ స్టోర్లో భారీ దొంగతనం జరిగింది.. దొంగలు ఏకంగా నాలుగు కోట్ల విలువైన ఫోన్లను దొంగిలించారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ “దొంగలాగా నక్కినక్కి కాదే.. దూసుకుపోవాలే.. ఎదురైనోన్ని ఏసుకుంటూ పోవాలే అంటాడు”. సరిగ్గా అలాగే అమెరికాలో యాపిల్ స్టోర్ లో కూడా దొంగలు ఇలాగే పడ్డారు.. కానీ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు విరుద్ధంగా వ్యవహరించి దొంగతనం చేశారు. ఏకంగా 4.10 కోట్ల ఫోన్లు మాయం చేశారు. ఇందుకు ఏకంగా బాత్ రూం కు ఏకంగా సొంరంగం తవ్వారు. అమెరికా లోని సియాటెల్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సియాటెల్ ప్రాంతంలో ఒక యాపిల్ స్టోర్ ఉంది.. ఇందులో ఫోన్లు దొంగలించేందుకు దొంగలు కాఫీ షాప్ లో చొరపడ్డారు. హాలీవుడ్ సినిమా “ఓషన్స్ ఎలెవన్” లో మాదిరి ఒక సొరంగం తవ్వారు. యాపిల్ స్టోర్ బ్యాక్ రూం లో ప్రవేశించేందుకు కాఫీ షాప్ బాత్ రూం గోడకు రంద్రం చేసి సొరంగం తవ్వి స్టోర్ లోకి వెళ్లారు. సుమారు 436 ఐఫోన్లను దొంగలించారు. వీటి విలువ 4.10 కోట్లు ఉంటుందని యాపిల్ స్టోర్ వర్గాలు చెప్తున్నాయి.

ఈ సంఘటనపై కాఫీ షాప్ రిటైల్ మేనేజర్ ఎరిక్ మార్క్స్ మాట్లాడుతూ “దొంగతనం జరిగిన తర్వాత ఉదయం నాకు కాల్ వచ్చింది. ఏం చెప్పాలో తెలియడం లేదు. యాపిల్ స్టోర్ లో దొంగతనం చేసేందుకు నా షాప్ ను దొంగలు ఉపయోగించారు” అని వాపోయాడు. ఇక కాఫీ షాప్ సీఈవో మైక్ అట్కిన్సన్ దొంగతనానికి సంబంధించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. “దొంగతనం చేసేందుకు దొంగలు మా కాఫీ షాప్ తాళాలు ధ్వంసం చేశారు. వాటి మరమ్మతులకు 900 డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాగే బాత్రూం ను సరి చేసేందుకు ఆరు నుంచి 800 డాలర్లు వెచ్చించాల్సి వచ్చిందని” వివరించాడు. అయితే ఈ దొంగలను పట్టుకున్నారా లేదా అనేది తెలియ రాలేదు.