Davos Summit దావోస్ లో( davos ) పెట్టుబడుల సదస్సు ముగిసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంది. అయితే ఎంత పెట్టుబడులు తెచ్చారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాదు ఒప్పందాలు కూడా చేసుకుంది తెలంగాణ సర్కార్. అయితే గత నాలుగు రోజులుగా టిడిపి అనుకూల మీడియా దావోస్ పర్యటనపై ప్రత్యేక కథనాలు రాస్తోంది. పెట్టుబడుల స్వర్గధామం ఏపీ అని.. దావోస్ దాసోహం అంటూ రకరకాల కథనాలు వండి వార్చుతోంది. అయితే కేవలం పెట్టుబడులు ఆహ్వానించడానికి ఏపీ బృందం పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైరల్ అవుతున్నాయి.
* ఆహ్వానంపై సెటైర్లు
దావోస్ నుంచి సీఎం చంద్రబాబుతో ( Chandrababu)పాటు ఇతర మంత్రులు ఏపీకి చేరుకున్నారు. వారికి రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అయితే రాష్ట్రానికి ఏం తెచ్చారని ఆహ్వానాలు పలుకుతున్నారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే తాజాగా సీఎం చంద్రబాబు దీనిపై మాట్లాడారు. విమర్శలు చేసేవారు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. తాము లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని.. కేవలం ఎంవోయూలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదని.. మనం చేసే నెట్వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయని చెబుతున్నారు చంద్రబాబు. హైదరాబాదును అలాగే అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే దావోస్ పర్యటనకు సంబంధించి ముందస్తు ప్రచారానికి రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
* అప్పటి సీఎంపై వ్యతిరేక కథనాలు
గతంలో వైసిపి( YSR Congress ) హయాంలో అప్పటి సీఎం జగన్ నేతృత్వంలోని బృందం దావోస్ వెళ్ళింది. ఆ సమయంలో టిడిపి అనుకూల మీడియా చేసిన వ్యతిరేక ప్రచారం అంతా ఇంత కాదు. అంత దూరం వెళ్లి స్వదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడం ఏంటని ప్రశ్నించింది ఎల్లో మీడియా. ఇప్పుడు అదే ప్రశ్న చంద్రబాబుకు ఎదురవుతోంది. అప్పట్లో జగన్ దావోస్ పర్యటనను ఎద్దేవా చేశారని.. ఇప్పుడు మీరు చేసిందేమిటి అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది. నెటిజెన్లు దీనిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కూటమి పార్టీలో సైతం దావోస్ పెట్టుబడులపై విచిత్రమైన చర్చ నడుస్తోంది. అనవసరంగా లేనిపోని ప్రచారం చేశారని.. ఏదైనా హడావిడి లేకుండా చేసి ఉంటే జరిగిపోయేదని అభిప్రాయపడుతున్నారు.
* అప్పట్లో వైసీపీ పై విమర్శలు
వాస్తవానికి సీఎం చంద్రబాబు( Chandrababu) చెప్పినట్టుగా.. ఎంవోయులతో పరిశ్రమలు రాకపోవచ్చు. కానీ గతంలో ఇదే వైసీపీ సర్కార్ ఇలానే వ్యవహరిస్తే లేనిపోని విమర్శలు చేసాం. ఇప్పుడు అవే విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం దావోస్ పర్యటనకు సంబంధించి ప్రచారానికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అయితే పెట్టుబడులు ఎంత వచ్చాయి అని ప్రశ్నిస్తుంటే మాత్రం నిర్దిష్టమైన గణాంకాలు చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది. అదే విపక్షానికి అస్త్రంగా మారుతుంది. భవిష్యత్తులో రాబోయే పెట్టుబడుల కోసం ఇప్పుడే అడిగితే ఏం చెబుతామని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వం తన డొల్లతనాన్ని బయట పెట్టుకుంటుంది.