VijayaSai Reddy : అనుకున్నట్టే చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy ). రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈరోజు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. వెంటనే ఈ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ సందర్భంగా తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది వివరించే ప్రయత్నం చేశారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని పేర్కొన్నారు. తన రాజీనామాతో కూటమికి లబ్ధి చేకూరుతుందని చెప్పుకొచ్చారు. తనలాంటివారు ఎంతమంది బయటకు వెళ్లినా.. జగన్ కు నష్టం లేదని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. తాను ముందుగా చెప్పిన మాదిరిగానే ఏ పార్టీలో చేరనని కూడా స్పష్టతనిచ్చారు. నిన్న సోషల్ మీడియా వేదికగా తన రాజీనామా విషయాన్నీ ప్రకటించారు విజయసాయిరెడ్డి. వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. రేపు రాజ్యసభ స్థానానికి సైతం రాజీనామా చేస్తానని చెప్పారు. చెప్పిన మాదిరిగానే ఈరోజు తన రాజీనామాను ఏకంగా రాజ్యసభ చైర్మన్ కు అందించారు.
* జగన్ తో చర్చించా
అయితే రాజీనామా ప్రకటించిన అనంతరం ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు విజయసాయిరెడ్డి. తన నిర్ణయం పై జగన్ తో( Jagan Mohan Reddy) చర్చించినట్లు తెలిపారు. ఏ ఇబ్బంది వచ్చినా తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని చెప్పినట్లు వెల్లడించారు విజయసాయి. అయితే తన రాజీనామాతో కూటమికి లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన స్థానంలో ఎన్నికయ్యేందుకు వైసిపికి అవకాశం లేదని గుర్తు చేశారు. అదే సమయంలో తన నిర్ణయం వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో వచ్చిన పరిస్థితి ఒకలా ఉండేదని.. ఇప్పుడు మరోలా ఉందని చెప్పారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత బలహీనుడు అవుతానని.. అటువంటప్పుడు తనపై కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆశలు, కేసు మాఫీలు తాను ఆశించలేదని తేల్చి చెప్పారు. తనలాంటి వాళ్లు ఎంతమంది బయటకు వెళ్లినా జగన్ కు నష్టం లేదని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
* గత విషయాల ప్రస్తావన
అయితే గత విషయాలను సైతం ప్రస్తావించారు. జగన్( Jagan Mohan Reddy) కేసులను గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన అప్రూవర్ గా మారని విషయాన్ని గుర్తు చేశారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని చెప్పుకొచ్చారు. తన బంధువుల వ్యాపారాల్లో తన ప్రమేయం లేదని కూడా అన్నారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. పవన్ తో చెన్నైలో ఉన్న సమయం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వైసీపీలో విభేదాలతోనే తాను బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోందని.. ఇన్ని రోజులు వైసీపీలో తన స్థానం తనదేనని.. ఎవరితోనూ విభేదాలు లేవని సాయి రెడ్డి పేర్కొన్నారు.
* వైసిపి చివరి అస్త్రం
అయితే విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రాజీనామా ఉపసంహరణకు సంబంధించి చివరి వరకు వైసిపి నేతలు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలోకి దిగారు. ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డి తో కీలక చర్చలు జరిపారు. అయితే విజయసాయిరెడ్డి తో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేస్తారని ప్రచారం నడిచింది. ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డిని పిల్లి సుభాష్ చంద్రబోస్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన జగన్ దూతగా ఢిల్లీలో అడుగుపెట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటికే తాను ఒక నిర్ణయం తీసుకున్నానని.. వెనక్కి తగ్గలేనని చెప్పిన విజయసాయిరెడ్డి నేరుగా.. రాజ్యసభ చైర్మన్ కు కలిసి రాజీనామా పత్రం అందించారు.
జగనన్న తో ఫోన్లో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాను!
– విజయసాయి రెడ్డి pic.twitter.com/UvvYSWT4qL
— Anitha Reddy (@Anithareddyatp) January 25, 2025