Suryakumar Yadav: బంతిని బ్యాట్ తో కొట్టడం వేరు. కసి తీరా కొట్టడం వేరు. కానీ సూర్య కుమార్ యాదవ్ మూడో రకం. తన కసితీరేలా మైదానం నలుమూలల కొడతాడు.. మూడు వందల అరవై డిగ్రీల్లో ఎటైనా బంతిని పంపిస్తాడు.. అందుకే అతడు “మిస్టర్ 360” అయ్యాడు. టి20 లో కొత్త తరహా ఆట తీరును వెలుగులోకి తీసుకొచ్చి… తిరుగులేని బ్యాట్స్ మెన్ గా రూపాంతరం చెందాడు.

చిన్నప్పటి ఆట ప్రేరణగా..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూర్యకుమార్ యాదవ్ చిన్నప్పుడు స్కూల్లో తన తోటి స్నేహితులతో క్రికెట్ ఆడేవాడు. వర్షం పడుతున్నప్పుడు ఆ బంతి అతడి మీదికి దూసుకొచ్చేది . దాని నుంచి కాపాడుకునేందుకు బ్యాట్ ను ఎటుపడితే అటు తిప్పి ఆడేవాడు. అప్పటికే అతడు తన ఒళ్ళును విల్లులా ఒంచడం మొదలుపెట్టాడు. ఇక ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన తర్వాత బౌలర్లు ఆఫ్ సైడ్ ఫోర్లు కొట్టకుండా సూర్య కుమార్ యాదవ్ శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బంతులు వేసేవాళ్ళు.. ఈ సమయంలో అతడు భిన్నమైన టెక్నిక్ నేర్చుకున్నాడు. క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ స్విచ్ షాట్లు, రివర్స్ స్వీప్ లు, అప్పర్ కట్ లు ఆడుతూ బౌండరీలు సాధించేవాడు. టి20 మ్యాచ్ ల్లోనూ ఇదే సూత్రాన్ని అవలంబించాడు. అదే అతడిని మిస్టర్ 360 ని చేసింది.. మైదానంలో ఆకలి గొన్న పులిలా ఆడే సూర్య కుమార్ యాదవ్.. నెట్స్ లో మాత్రం పద్ధతిగా సాధన చేస్తాడు.. కానీ బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం బంతి బ్యాట్ లో స్వీట్ స్పాట్ కు తగిలిందా లేదా అని చూసుకుంటాడు.. కానీ బలంగా బంతిని బాదడం లో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడడు.
ఇతడి వెనుక వారు
సూర్య కుమార్ యాదవ్ ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం వెనుక తన సహచరులు కూడా ఉన్నారు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని సూర్యకుమార్ యాదవ్ పాలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విరాట్ భాయ్ తో ఆడటాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ ను తన పెద్దన్నయ్యలా భావిస్తాడు. తనకు ఏ మాత్రం సందేహం వచ్చినా వెంటనే అతడిని అడిగేస్తాడు. 2018 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో చేరిన దగ్గర నుంచి రోహిత్ శర్మను సూర్య కుమార్ యాదవ్ తన మార్గదర్శిగా భావించడం ప్రారంభించాడు.. అయితే అంతకుముందు కోల్ కతా నైట్ రైడర్స్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడేవాడు. ఆ టీం నుంచి ఇండియన్స్ కి వచ్చిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావాలని కోరిక సూర్య కుమార్ యాదవ్ ఉండేది.. అయితే అతడి మీద భరోసా ఉంచి టీం మేనేజ్మెంట్ ఆ బాధ్యత అప్పగించింది.. ఇది సూర్యకుమార్ యాదవ్ కెరియర్ కు పెద్దమలుపు.. ఇక 2016లో దేవీషా ను పెళ్లి చేసుకున్న తర్వాత సూర్య కుమార్ యాదవ్ కు బాగా కలిసి వచ్చింది. అతడి ప్రతి ప్రణాళికలో ఆమె భాగస్వామిగా ఉంటుంది.. ఎక్కడికి వెళ్లినా ఆమెను తీసుకెళ్తుంటాడు. ఆమె ప్రయాణం కుదరదు అని చెప్పినా వెంటపడి మరీ తీసుకెళ్తాడు. ఎందుకంటే అతడి ఆట తీరును మార్చిన వారిలో ఆమె కూడా ఒకరు.

ఒళ్లును విల్లులాగా..
సూర్య కుమార్ యాదవ్ ఎలాగైనా బ్యాటింగ్ చేయగలడు. ఏ స్థానంలో వచ్చినా మంచినీళ్ల ప్రాయంలాగా పరుగులు సాధించగలడు.. ముఖ్యంగా మైదానం నలుమూలలా షాట్లు కొట్టడంలో అతడికి అతడే సాటి.. అలుపు అన్నదే రాకుండా బ్యాటింగ్ చేయడం అతడి నైజం.. అయితే ఫిట్నెస్ కాపాడుకునేందుకు అతడు మైదానంలో కఠోర సాధన చేస్తాడు. తనకు అనారోగ్యం వస్తే తప్ప జిమ్ ను వదిలిపెట్టడు. ఈ విషయంలో తనకు కోహ్లీ ప్రేరణ అని చెబుతూ ఉంటాడు. సో ఇదండీ.. సూర్య కుమార్ యాదవ్ మిస్టర్ 360 గా మారడం వెనుక ఉన్న కథ..