Toll Tax
Toll Tax: హైవేలు.. ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించేందుకు వాహనదారులు ఇష్టపడతారు. వీటిపై వేగంగా వెళ్లడంతోపాటు సమయం ఆదా అవుతుందని, ఇంధనం పొదుపు చేయవచ్చని భావిస్తారు. అయితే హైవే, ఎక్స్‌ప్రెస్ వేలపై వెళ్లేవారు కచ్చితంగా టోల్ ట్యాక్స్ చెల్లించాలి. పెరుగుతున్న టోల్ చార్జీలు వాహనదారులకు భారంగా మారుతున్నాయి. మన దేశంలో రోడ్లపై టోల్ వసూలు సాధారణంగా మారింది. దూర ప్రయాణాలు చేసేవారు వీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐదారు టోల్ ప్లాజాలు దాటాల్సి వచ్చినప్పుడు వాటికి చెల్లించే చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టోల్ భారం తప్పించుకునేందుకు గూగుల్ ఒక ఫీచర్ తీసుకువచ్చింది. అయితే గూగుల్ మ్యాప్స్‌లో కొంత పనిచేయాల్సి ఉంటుంది.
ప్రత్యేక ఫీచర్..
టోల్ ట్యాక్స్‌ను నివారించేందుకు గూగుల్ మ్యాప్స్‌లో ప్రత్యేక ఫీచర్ ఉంది. వాహనదారులు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లొకేషన్ చేరుకోవడానికి మార్గం సెర్చ్ చేయాలి. అప్పుడు లొకేషన్ మార్గం మనకు కనిపిస్తుంది. ఇందులో టోల్ ప్లాజాల వివరాలు కూడా వస్తాయి. ప్రయాణ మార్గంలో ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయో ముందే తెలిసిపోతుంది. దీంతో టోల్ నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. కొన్ని ఆప్షన్ల ద్వారా దీనిని తెలుసుకోవచ్చు.
టోల్ ట్యాక్స్ ఇలా తప్పించుకోవచ్చు..
టోల్ టాక్స్ నుంచి తప్పించుకోవాలంటే.. వాహనదారులు ఇలా చేయాలి. గూగుల్ మ్యాప్స్‌ను ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించాలి. ఇందుకు ఇలా చేస్తే మీకు టోల్ భారం తప్పుతుంది.
– ముందుగా స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. మనం వెళ్లాల్సిన స్థలం, చిరునామా ఎంటర్ చేయాలి. తర్వాత డైరెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ స్థానాన్ని ఎంచుకోవాలి.
– తర్వాత ఎగువన ఉన్న రవాణా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కారు గుర్తు పక్కన ఉన్న మూడు చుక్కల మెనూ నొక్కాలి. దీని తర్వాత టోల్‌లను నివారించే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే మనకు టోల్ ప్లాజా లేని మార్గం కనిపిస్తుంది.
– అయితే ఈ మార్గం ఒక్కోసారి దూరం ఎక్కువగా ఉంటే అవకాశం ఉంటుంది. కొన్ని రూట్లలో టోల్ ప్లాజా లేని మార్గం ఉండకపోవచ్చు అప్పుడు తప్పనిసరిగా టోల్ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు షార్ట్‌కట్ రూట్స్ ఉంటాయి. ఆ మార్గాల్లో వెళితే దూరం తగ్గుతుంది. టోల్ కూడా తప్పుతుంది.