Balakrishna: రాయలేలిన సీమ రాయలసీమ. రత్నాలు రాశులుగా పోసి అమ్మిన రతనాల సీమ. ఇది చరిత్ర. బాంబుల మోతలు, తెగిన కుత్తుకల నెత్తుటి కథలు, వేటకొడవళ్ల వీర విహారాలు… ఇది కూడ చరిత్రే. అభివృద్ధి కోసం అర్రులు చాస్తూ, నీటి కోసం నోరెళ్లబెట్టుకుని ఎదురుచూస్తున్న సీమ వర్తమానం. చరిత్రనే వర్తమానంగా సినిమాల్లో చిత్రీకరించడం దౌర్భాగ్యం. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి సీమ అస్థిత్వం పై చర్చకు తెరలేసింది.

రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని సినిమా వ్యాపార వస్తువుగా మార్చేసింది. కొన్నేళ్ల క్రితం కాసుల పంట పండించింది. ట్రెండ్ ముగిసింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు పెవిలియన్ బాట పట్టాయి. ఫలితంగా ట్రెండ్ మారింది. రాయలసీమ ఫ్యాక్షనిజం పై సినిమాలు తగ్గాయి. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం తగ్గలేదు. కొత్త సీసాలో పాత సారా పోసినట్టు వీరసింహారెడ్డిని తెరపైకి తెచ్చారు. అదే ఫ్యాక్షన్ కథనే, అదే నరుకుడినే సినిమా మొత్తం చూపిస్తూ.. బాలయ్యా ఇంక మారవా ? అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగిస్తున్నాడు.
వీరసింహారెడ్డి సినిమా పై రాయలసీమవాసులు కలెక్షన్ల వర్షం కురిపించినప్పటికీ.. రాయలసీమ వాదులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాక్షన్ కథలతో రాయలసీమ అస్థిత్వం పై దాడి చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత కాలపు ఫ్యాక్షనిజం నేడు సీమలో లేదని, సీమను మరో కోణంలో చూడాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నారు. బాంబులు చుట్టడాలు, విసరడాలు, వేటకొడవళ్ల పట్టడాలు నేటి సీమలో కనిపించవు. పుస్తకాలు పట్టిన చేతులు, వసలబాట పట్టిన నెత్తులు, నీటి కోసం నోరు తెరుచుకున్న బీడు భూములు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ హోల్డర్లు నేటి రాయలసీమలో కనిపిస్తారు.

ఫాక్షనిజం రాయలసీమలో ఒక అవశేషం మాత్రమే. పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లు రాయలసీమవాసుల ఆలోచనల్లో మార్పు తెచ్చాయి. అభివృధ్దితో వచ్చే అవకాశాల్ని కళ్లకు కట్టినట్టు చూపాయి. ఫ్యాక్షనిస్టుల వెంట వెళ్లే సీమ యువత లేదిప్పుడు. ఐటీ కంపెనీల వెంట పడే సీమ యువత నేటి నిజం. ఉపాధి అవకాశాల కోసం వలసపోతున్నారు కానీ రాజకీయ నాయకుల వెంట తిరగడంలేదు. సీమలో అభివృద్ధి జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప ఫ్యాక్షన్ రాజకీయాల్ని కోరుకోవడం లేదు. అరొకర ఘటనలు జరిగినా అవి రాజకీయ, స్వార్థపూరిత ప్రేరేపిత ఘటనలే తప్పా .. ఫ్యాక్షన్ పగలు కాదు.
సీమ ఫ్యాక్షనిజాన్ని ఇన్నాళ్లూ వ్యాపార వస్తువుగా మార్చుకుని కోట్లు సంపాదించారు. ఇకనైనా మారాలని రాయలసీమ బుద్ధిజీవులు కోరుతున్నారు. సీమ సమస్యల పైన, నీటి అవసరాల పైన, పారిశ్రామికాభివృద్ధి పై కథలు, కథలుగా సినిమాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీమలో వర్తమానం గురించి చర్చించమంటున్నారు. ఫ్యాక్షనిజం చరిత్ర. కొందరి స్వార్థపూరిత క్రీడ. ఆ క్రీడలో బలిపశులు మాత్రం సామాన్యులు. ఆ ఫ్యాక్షనిస్టులే నేటి పెట్టుబడిదారులు, రాజకీయ నేతలు. స్వప్రయోజనా కోసం జరిగిన ఫ్యాక్షనిజాన్ని మరోసారి సినిమాలో చూపి తనెవెల్లా గాయాలతో బాధపడుతున్న సీమను గుచ్చిగుచ్చి చంపవద్దంటూ సీమ బుద్ధిజీవులు నందమూరి బాలకృష్ణను, సినిమారంగాన్ని కోరుతున్నారు.