Sankranti Haridas: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. దీంతో ఏపీలో సంక్రాంతి వైబ్స్ మొదలవుతున్నాయి. గ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమవరంలో కోడిపందేల సందడి పందెం రాయుళ్లు పందెం కోళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో ‘హరిలో రంగ హరీ’ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు కూడా అప్‌డేట్ అవుతున్నారు. ట్రెండ్ మార్చేస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా మారిపోతున్నారు. నయాగెటప్‌లో ఇప్పుడు దర్శనమిస్తున్నారు హరిదాసులు.
ట్రెండ్ సెట్‌చేస్తున్నారు..
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నిండైన వస్త్రధారణతో చేతిలో చిడతలు వాయిస్తూ హరినామ కీర్తనలు ఆలపిస్తూ తలపై అక్షయపాత్రను ధరించి ఏటా సంక్రాంతి మాసం ప్రారంభం ధనుర్మాసంలో వారు రావడం ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం. అయితే, కాలంతోపాటు వచ్చిన మార్పులకు హరిదాసులు కూడా ట్రెండ్ మార్చారు. కాలినడకన వచ్చే హరిదాసులు ఇప్పుడు వెరైటీ వాహనాలను వాడుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాల్లో హరిదాసులు వెరైటీ వాహనాలపై తిరుగుతున్నారు.
చిడతలు పోయి.. టేపు రికార్డులు..
ఇక గ్రామాల్లోకి చిడతలు వాయిస్తూ, పాటలు పాడుతూ, హరినామ కీర్తనలు చేస్తూ వచ్చే హరిదాసులు ఇప్పుడు టేపురికార్డుల్లో పాటలు పెడుతూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. అయితే, నడిచి వెళ్లకుండా ఇలా ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే వయస్సు మీద పడటంతో నడవలేకపోతున్నామని, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని వదలలేక ఇలా తిరుగుతున్నామని హరిదాసులు చెపుతున్నారు.
బైక్ ముందు అక్షయపాత్ర..
ఇక తలపై పెట్టుకునే అక్షయ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బైక్ ముందుభాగంలో అమరుస్తున్నారు. వీధుల్లోకి భక్తిపాటలతో వాహనం రాగానే ఇళ్లలోని మహిళలు బయటకు వచ్చి.. బైక్ ముంద ఉన్న అక్షయపాత్రలో బియ్యం పోస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు మారక తప్పడం లేదని కొంతమంది యువ హరిదాసులు పేర్కొంటున్నారు.