కొందరు దుర్మార్గులు, నీచులు కరోనా శవాలను కూడా వదలడం లేదు. కరోనాతో చనిపోయిన వాళ్ల శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను, నగదును మాయం చేస్తున్నారు. గతంలో తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోగా తాజాగా విజయనగరంలో చోటు చేసింది. విజయనగరంలోని రాజపురంకు చెందిన సరస్వతి అనే మహిళకు కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. సదరు మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడింది.
ఆస్పత్రి సిబ్బంది చనిపోయిన సరస్వతిని మార్చురీకి తరలించి మృతదేహం గురించి మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆస్పత్రిలో ఆమె కుటుంబ సభ్యులు మృతదేహం చూడాలని ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది అందుకు అంగీకరించలేదు. దీంతో మృతదేహాన్ని తీసుకుని సరస్వతి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. స్మశానానికి వెళ్లి మృతదేహాన్ని చూసిన సరస్వతి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
సరస్వతి శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఉంగరాలు మాయమయ్యాయని గుర్తించారు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యానికి మహిళ బంగారం గురించి ఫిర్యాదు చేశారు. విషయం బయటకు తెలిస్తే ఆస్పత్రి పరువు పోతుందని భావించిన యాజమాన్యం విచారణ జరిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మార్చురీ సిబ్బంది సరస్వతి బంగారం, ఆభరణాలు మాయం చేసినట్లు గుర్తించి వాటిని వెనక్కు ఇప్పించారు.