Flipkart- PhonePe: ఫోన్ పే.. బహుశా దీని పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా దీన్ని విరివిగా వాడుతున్నారు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆప్… నగరాల నుంచి గ్రామాల దాకా వేగంగా చొచ్చుకుపోయింది. కేవలం ఈ ఆప్ ద్వారా రోజుకు కోట్ల కొద్ది నగదు లావాదేవీలు ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ సంస్థ ప్లిఫ్ కార్ట్ భాగస్వామ్యంలో ఉండేది.. కానీ ఇప్పుడు విడిపోయింది. ఫోన్ పే కు “ఫైన్ టెక్ యూని కార్న్” మాతృ సంస్థ. ఇది ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ లో అంతర్లీనంగా ఉండేది. అయితే ఇప్పుడు అది దాని నుంచి విడిపోయింది. ఈ మేరకు రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన చేశాయి. ఫోన్ పే తన పూర్తి యాజమాన్య విభజనను ప్రకటించింది. ఇక రెండు కంపెనీలు వేరువేరు సంస్థలుగా పనిచేస్తాయి. వాల్ మార్ట్ ఈ రెండు కంపెనీల్లో వాటాదారుగా ఉన్నది. విభజన నేపథ్యంలో వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్ కార్ట్ సింగపూర్, ఫోన్ పే సింగపూర్ వాటాదారులు ఫోన్ పే ఇండియాలో పూర్తి షేర్లను కొనుగోలు చేశారు. పనిలో పనిగా ఫోన్ పే భారతదేశం నుంచే కంపెనీ కార్యకలాపాలు సాగించే ప్రక్రియ కూడా పూర్తి చేశారు.. ఈ కొనుగోలు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. 2022 సంవత్సర ప్రారంభంలోనే మొదలైంది. అనేక చర్చల తర్వాత అది ఒక కొలిక్కి వచ్చింది.. డిసెంబర్ నెల చివరిలో కార్యరూపం దాల్చింది.

ఇలా ప్రారంభమైంది
ఆన్ లైన్ చెల్లింపుల్లో కొత్త తరహా విధానానికి నాంది పలకాలని ఫ్లిప్ కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ లు సమీర్ నిగం, రాహుల్ చారి, బుజ్జి ఇంజనీర్ ఫోన్ పే ను స్థాపించారు.. దీని మాతృ సంస్థ ఫైన్ టెక్ యూనికార్న్. అయితే దీనిని 2018లో దీనిని ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేసింది.. ఫోన్ పే కంటే ముందు ఫ్లిప్ కార్ట్ ఎన్ జీ పే,ఎఫ్ ఎక్స్ మార్ట్ ప్రైవేట్ అనే సంస్థలను కొనుగోలు చేసింది. కానీ అవి ఎందుకనో ఫోన్ పే అంత వేగంగా అభివృద్ధి చెందలేదు. ఇక అప్పట్లో ప్లిఫ్ కార్ట్ కొనుగోలు చేసిన అతి పెద్ద మూడవ కంపెనీ ఫోన్ పే. అయితే ఈ క్రమంలో ఫోన్ పేను ఫ్లిప్ కార్ట్ అభివృద్ధి చేసింది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా దానిని రూపొందించింది. భారతదేశంలో ప్రస్తుతం ప్రతి వంద మందిలో పదిమంది ఫోన్ పే వాడుతున్నారు.. దీనికి పోటీగా గూగుల్, పే టీ ఎం, అమెజాన్ పే వంటివి తెరపైకి వచ్చినా అంతగా ప్రాచుర్యం పొందలేదు.. వాస్తవానికి ఫోన్ పే కంటే పేటీఎం ముందుగానే మార్కెట్లోకి వచ్చినప్పటికీ… తర్వాత ఫోన్ పే ముందు అంతగా నిలబడలేకపోయింది.. అయితే ఈ విభజన పరిణామంపై ఫ్లిప్ కా ర్ట్ గ్రూప్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి వ్యాఖ్యానిస్తూ ఫ్లిప్ కార్ట్ గ్రూపు చాలామంది విజయవంతమైన వ్యవస్థాపకులు అభివృద్ధి చేసిందని కొనియాడారు.. ఇకముందూ ప్రభావవంతమైన వ్యాపారాలను భారతీయ ప్రజలకు అందుబాటులోకి తెస్తుందన్నారు. ఫ్లిప్ కార్ట్, ఫోన్ పే ఈరోజు ఇంత విజయవంతమయ్యాయి అంటే దానికి కారణం 130 కోట్ల భారతీయులు, వారి విశ్వాసమే కారణమని పేర్కొన్నారు.

ఇతర వ్యాపారాల్లోకి
ఫోన్ పే ఫ్లిప్కార్ట్ నుంచి విడిపోయిన తర్వాత, దాని ద్వారా వచ్చిన నగదుతో ఇతర వ్యాపారాల్లోకి వెళ్లాలని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగం యోచిస్తున్నారు.. ఆరోగ్య బీమా, వాహనాల బీమా, రుణాలు, సంపద నిర్వహణ, వర్టికల్స్ లో ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వంటి భిన్న రంగాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు.. ఇందులో రిస్కు తక్కువగా ఉండడంతో బిలియన్ల కొద్ది డబ్బును పెట్టుబడిగా పెట్టాలని సూచనప్రాయంగా తెలిపారు. కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఫిన్ టెక్ కంపెనీ తన మూలాలు మరింత బలోపేతమైన తర్వాత పబ్లిక్ ఇష్యు కు వెళ్లాలని యోచిస్తోంది.. అది కూడా 2023 నాటికి సాధించాలని అనుకుంటున్నది.