Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బస్సు నుజ్జునుజ్జుగా కనిపించింది. తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జుగా మారింది. అర్థరాత్రి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆరుగురు మృతి చెందగా.. 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాల పాలైన వారిలో చంద్రశేఖర్, సురేష్, గోపినాథ్, మనోజ్, రాజకుమార్, ఎస్. రమణ, పవన్, ధనవేశ్వర్, రణధీర్, త్రికరన్,శ్వేత, అజిత, కన్నన్, రూప, మైథిలి, అక్షయ్, గణేష్, నితిష్, లోకేష్, లక్ష్మి, కమలమ్మ, నిర్మల, కేశవ్ ఉన్నారు. వీరంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.