Fastag : దేశంలోని రాష్ట్ర, జాతీయ రహదారుల మీద ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లు భారీగా పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జూన్) ఈ టోల్ వసూళ్లు ఏకంగా 19.6 శాతం పెరిగి రూ.20,681.87 కోట్లకు చేరుకున్నాయి. ఈ సమాచారాన్ని నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో టోల్ చెల్లించిన వాహనాల సంఖ్య కూడా 16.2 శాతం పెరిగి 1,173 మిలియన్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో ఇది 1,009.87 మిలియన్లు మాత్రమే ఉంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా హైవే టోల్ ధరలను సగటున 4-5 శాతం మేరకు పెంచింది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రైవేటు వాహనదారుల కోసం రూ.3,000 విలువైన ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెడుతుందని ఆయన తెలిపారు. దీని వల్ల హైవే ప్రయాణం మరింత ఈజీ అవుతుందని, ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు.
Also Read: పెట్రోల్, డీజిల్‌కు గుడ్‌బై.. సీఎన్‌జీ కార్లదే హవా.. టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ ఇవే
ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది ఎన్‌హెచ్ఏఐ నిర్వహించే హైవేలపై చెల్లుబాటు అయ్యే ఒక ప్రీపెయిడ్ టోల్ ఫెసిలిటీ. ఇది ముఖ్యంగా కార్లు, జీపులు, వ్యాన్‌లు వంటి పర్సనల్ వెహికల్స్ కోసం రూపొందించారు. ఈ పాస్ యాక్టివేట్ అయిన తర్వాత, వాహనదారులు నేషనల్, నార్త్-ఈస్ట్ హైవే టోల్ ప్లాజాల వద్ద ప్రతిసారీ టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు. ఈ సౌకర్యం 200 ప్రయాణాలకు లేదా ఒక సంవత్సరం పాటు (ఏది ముందుగా పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ పాస్ రాష్ట్ర హైవేలు, ప్రైవేటు టోల్ రోడ్లు లేదా ఎన్‌హెచ్ఏఐ ద్వారా నిర్వహించబడని ఎక్స్‌ప్రెస్‌వేలపై చెల్లుబాటు కాదు.
ఫాస్టాగ్ అంటే ఏమిటి?
ఫాస్టాగ్ అనేది భారతదేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ట్యాగ్. ఈ ట్యాగ్‌ను వాహనం ముందు అద్దం పై అతికిస్తారు. వాహనం టోల్ ప్లాజాకు చేరుకోగానే, ఫాస్టాగ్ స్కాన్ అవుతుంది, టోల్ డబ్బు నేరుగా వాహన యజమాని ప్రీపెయిడ్ ఫాస్టాగ్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీనివల్ల టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రయాణం వేగంగా, సౌకర్యవంతంగా సాగుతుంది.
Also Read: తెలుగు నటుడిని బండ బూతులు తిట్టిన షారుక్ ఖాన్.. వైరల్ వీడియో
భారతదేశంలో మొదటిసారిగా 2014లో ఫాస్టాగ్ టోల్ కలెక్షన్ ప్రారంభమైంది. దీనిని ముందుగా అహ్మదాబాద్-ముంబై హైవేపై ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. ఆ తర్వాత నవంబర్ 2014లో ఢిల్లీ-ముంబై హైవేకు, జూలై 2015లో చెన్నై-బెంగళూరు హైవేకు విస్తరించారు. 2016 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 247 టోల్ ప్లాజాల్లో ఇది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిని మరిన్ని టోల్ ప్లాజాలకు విస్తరించి, 2021 ఫిబ్రవరి నుంచి భారతదేశంలోని అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది.