
AP Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం సిద్ధమవుతోంది. అసమ్మతి జ్వాలలు రగులుతున్న వేళ.. ముందస్తే మంచిదని ఆ పార్టీ భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందని ఆలోచిస్తోంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలు ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?. చరిత్ర ఏం చెబుతోంది ? అన్న ప్రశ్నల పై ఈ స్టోరీలో విశ్లేషణ చేద్దాం.
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న చర్చ ఒకటి పురుడుపోసుకుంది. ఇలాంటి చర్చలు సహజంగానే ప్రతిరాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి చర్చే ఇప్పుడు ఏపీలో కూడా జరుగుతోందని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా పార్టీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాయి. కొన్ని పార్టీలకు ముందస్తు ఎన్నికలు కలిసొస్తే.. మరికొన్ని పార్టీలకు ఘోరపరాభవాన్ని మిగిల్చాయి. రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందని భావించినప్పుడు పార్టీలు ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తాయి. అదే సమయంలో ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలనుకున్నప్పుడు ముందస్తు ఎన్నికల ప్లాన్ చేస్తారు. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పవచ్చు. నిర్దేశిత పదవీ కాలాన్ని పూర్తీ కాకుండా.. అసహజంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.
జగన్ ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లడం వెనుక కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే వైసీపీలో అసమ్మతి రగులుతోంది. ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు. ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా కచ్చితంగా జగన్ కు ఓటేస్తామని ఘంటాపథంగా చెప్పలేకపోతున్నారు. కప్పదాటు వైఖరితో జనం ఉన్నారన్న పరిస్థితి వివిధ సర్వేల్లో వెల్లడవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారం సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఆలస్యం చేసిన కొద్దీ జనంలో వ్యతిరేకత పెరుగుతుంది. ఫలితంగా వచ్చే ఎన్నికలు నల్లేరు మీద నడకలా ఉండవు. ఇలాంటి నేపథ్యంలో ముందస్తుకు వెళితే లాభం ఉంటుందని తాడేపల్లి కోటరీ భావిస్తోంది.
ప్రతిపక్షాల వైపు నుంచి కూడా తట్టుకోలేని ఒత్తిడి ప్రభుత్వం పై పడుతోంది. నారా లోకేష్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్షాలకు జనంలో బలం పెరుగుతోందన్న సర్వేలు కూడా ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితి చేయి దాటుతుందని జగన్ భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే.. ముందస్తు ఎన్నికలు అన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వవు. చరిత్రను తిరగేస్తే మనకు బోధపడేది అదే.

ఏపీ లాంటి రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఆర్థికంగా నష్టమే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారింది. అప్పులతో సంక్షేమ రాజ్యాన్ని నడిపిస్తోన్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ముందస్తు ఎన్నికలు రాష్ట్రానికి ఆర్థిక భారంగా పరిణమిస్తాయి. సమయం, డబ్బు వృథా అవుతుందని చెప్పవచ్చు. గతంలో జరిగిన ముందస్తు ఎన్నికలు, వాటి ఫలితాలు రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం అని చెప్పవచ్చు. 1989లో ఎన్టీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో వాజ్ పేయి 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి చవిచూశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రాజకీయ పార్టీలకు చేదు అనుభవాన్నే మిగిల్చాయని చెప్పవచ్చు. ఏపీలో కూడా అలాంటి అనుభవాలే మిగులుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.