
Actor Suman: తెలుగులో స్టార్స్ గా వెలిగిపోయిన ఇతర భాషల హీరోల్లో సుమన్ ఒకరు. 80లలో సుమన్ ఒక సెన్సేషన్. వరుస చిత్రాలతో పరిశ్రమను షేక్ చేశారు. సుమన్ కి కరాటేలో బ్లాక్ బెల్డ్ ఉంది. మంచి హైట్, చక్కని రూపం. పక్కా హీరో మెటీరియల్ అని గమనించి సన్నిహితులు ప్రోత్సహించడంతో సుమన్ సినిమాల్లోకి వచ్చారు. తన రియల్ టాలెంట్ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ రోజుల్లో సుమన్ ఫైట్స్ సరికొత్త ఒరవడి సృష్టించాయి. 1979 లో విడుదలైన తమిళ చిత్రం నీచల్ కులం మూవీతో ఆయన హీరో అయ్యారు.
అయితే ఆయన్ని తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చింది మాత్రం భాను చందర్ అట. తమిళ్ కంటే తెలుగులో మంచి కెరీర్ ఉంటుంది. ఎదిగేందుకు స్కోప్ ఉంటుందని భాను చందర్ ప్రోత్సహించడంతో సుమన్… తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టారు. 80లలో తెలుగు పరిశ్రమ చెన్నై కేంద్రంగానే నడిచేది. దీంతో సుమన్ తెలుగు-తమిళ చిత్రాల్లో ఏక కాలంలో నటించారు. ఇద్దరు ఖిలాడీలు చిత్రంతో సుమ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. భాను చందర్ మరో హీరోగా నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
భాను చందర్ కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్. వీరి కాంబోలో ఫైట్స్ థియేటర్స్ లో ప్రేక్షకులు విజిల్స్ వేసేలా చేశాయి. మెల్లగా తమిళ్ కంటే తెలుగులో సుమన్ ఎక్కువగా చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఏడాదికి 10 సినిమాలు చేస్తూ సుమన్ కెరీర్ పీక్స్ లో ఉండగా అనుకోని కుదుపు చోటు చేసుకుంది. 1985లో మే 18న అర్ధరాత్రి సుమన్ ఇంటికి పోలీసులు వచ్చారు. మీ ఇంట్లో బాంబు ఉందంటూ సెర్చ్ చేశారు. అనంతరం చిన్న ఎంక్వైరీ మీరు ఒకసారి స్టేషన్ కి రావాలని తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన సుమన్ ని నీలి చిత్రాల ఆరోపణలపై అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

సుమన్ నెలల తరబడి జైలులో ఉండాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ కూడా రాలేదు. జైలులో దుర్భర జీవితం గడిపారు. స్టార్ గా ఎదుగుతున్న హీరోని కొందరు కావాలని తొక్కేశారంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అదే రోజుల్లో ఎదుగుతున్న చిరంజీవి మీద కూడా ఆరోపణలు చేశారు. అయితే తాను జైలు పాలు కావడానికి ఒక స్నేహితుడు కారణమని సుమన్ నేరుగానే చెప్పారు. దివాకర్ అనే ఒక మిత్రుడు సినిమా క్యాసెట్స్ షాప్ నడుపుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు సుమన్ కారు దివాకర్ వాడుకునేవాడు. దివాకర్ నీలి చిత్రాలు తీయడం వంటి అసాంఘిక చర్యలకు పాల్పడ్డాడు. దాని కోసం సుమన్ కారు వాడుకున్నాడు. హీరో సుమన్ కి కూడా సంబంధం ఉందని ఆయన్ని ఇరికించారు. తనను ఎవరూ తొక్కేయలేదు. స్నేహితుడు కారణంగానే నేను బలి అయ్యాను. అయితే అప్పటి మీడియా విషయాన్ని వక్రీకరించి రాసిందని సుమన్ వెల్లడించారు.
