Russia: యుద్ధ భయం.. పిల్లలనూ కనడం లేదు.. ఆ దేశంలో భారీగా తగ్గిన జనన రేటు!

ఒకప్పుడు రాజ్య విస్తరణ కోసం రాజులు యుద్ధాలు చేసేవారు. రాజ్యాలను ఆక్రమించుకునేవారు. నేడు ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నాయి. దేశాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. అయితే నేటి యుద్ధాలతో లాభాలకన్నా.. నష్టాలే ఎక్కువ.

Written By: Neelambaram, Updated On : September 11, 2024 9:51 am

Russia

Follow us on

Russia: ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండు వర్గాలుగా విడిపోయిన ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కొన్ని దేశాలు పరోక్షంగా మద్దతు తెలిపాయి. కొన్ని దేశాలు తటస్థంగా ఉన్నాయి. యుద్ధాల కారణంగా చాలా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం అంటేనే భయపడుతున్నాయి. అయినా సంపన్న దేశాలైన అమెరికా, రష్యా సైనిక చర్యల పేరిట యుద్ధాలు చేస్తున్నాయి. గతంలో అమెరికా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో తమ సైన్యాన్ని రంగంలోకి దింపి ఆ దేశాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇక రెండేళ్లుగా రష్యా కూడా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా సాయం అందిస్తోంది. దీంతో ఈ యుద్ధం సుధీర్ఘంగా సాగుతోంది. శక్తివంతమైన రష్యాను చిన్న దేశమైన ఉక్రెయిన్‌ అమెరికా సాయంతో దీటుగా ఎదుర్కొంటోంది. ఈ యుద్ధ ప్రభావంతో రెండువైపులా తీవ్ర నష్టం జరగుతోంది. ఉక్రెయిన్‌ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నది. అయినా రష్యాకు తలొగ్గేది లేదంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఇక ఉక్రెయిన్‌ కూడా రష్యాపై అమెరికా అందించిన ఆయుధాలతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యావైపు కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇది రష్యా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. మానసికంగా ఆందోళనకు గురిచేస్తోంది.

కొత్త చిక్కులు..
యుద్ధ ప్రభావంతో రష్యా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. తాజాగా కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. రష్యాలో జనన– మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు తాజాగా విడుదలైన అధికారిక డేటా వెల్లడించింది. ఇందులో వెల్లడించిన గణాంకాల ప్రకారం రష్యాలో ఈ ఏడాదిలో జూన్‌ వరకు 5,99,600 మంది పిల్లలు జన్మించారు. 2023 జూన్‌లో పోలిస్తే దాదాపు 16 వేల మంది పిల్లలు తక్కువగా పుట్టారు. 2024 జూన్‌లో లక్ష కంటే తక్కువ మంది శిశువులు జన్మించారు. దీంతో నవజాత శిశువుల సంఖ్య 6 శాతం తగ్గినట్లుగా ఇటీవల రష్యన్‌ మీడియా తెలిపింది. 1999 నుంచి జననాల రేటులో తగ్గుదల కనిపిస్తున్నట్లుగా నివేదిక పేర్కొంటోంది.

పెరిగిన మరణాలు ఇలా..
ఇక 2024 జనవరి నుంచి జూన్‌ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 49 వేలు అధికమని పేర్కొంది. రష్యాకు వచ్చిన వలసదారుల జనాభా 20.1 శాతం ఉండటంతో ఈ క్షీణత కొంతవరకు భర్తీ అయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో తక్కువ జననాలు నమోదవడాన్ని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ ఓ విపత్తుగా అభివర్ణించారు. ఇటీవల రష్యా దిగువ సభ డూమాలోని కుటుంబాల రక్షణ కమిటీ అధిపతి నినా ఒస్టానినా మాట్లాడుతూ జననాల రేటు తగ్గుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. దీనికోసం ‘ప్రత్యేక జనాభా ఆపరేషన్‌‘ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

నజరానా ప్రకటించిన పుతిన్‌..
జనన రేటు పెంచేందుకు సోవియట్‌ కాలంలో అమల్లో ఉన్న పథకాన్ని అధ్యక్షుడు పుతిన్‌ మళ్లీ పునరుద్ధరించారు. 10, అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్‌ రూబెల్స్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకు పైన) నజరానా, ’మదర్‌ హీరోయిన్‌’ అవార్డును ఇస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే 10వ బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ఈ నగదు చెల్లిస్తామని పేర్కొంది. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఈ అవార్డుకు సంబంధించి అప్పట్లో రష్యా మీడియాలో పలు కథనాలు వెలువరించాయి. అయినా జనాభాలో పెరుగుదల కనిపించకపోవడంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

యుద్ధ భయంతోనే..
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారీగా సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో జనన–మరణాల్లో అంతరం భారీగా పెరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన నాటినుంచి వేలాది మంది క్రెమ్లిన్‌ సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. అయితే రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతోంది.