Ponniyin Selvan Ticket Price: మరో మూడు రోజుల్లో మణిరత్నం విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్ థియేటర్స్ లో దిగనుంది. భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందించారు. విడుదలైన ప్రోమోలు అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పొన్నియిన్ సెల్వన్ విడుదల కానుంది. కాగా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మణిరత్నం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ టికెట్ ధర కేవలం రూ. 100 గా నిర్ణయించారు.
ముంబై వెళ్లిన మణిరత్నం అక్కడి థియేటర్స్ యాజమాన్యాలతో ఈ మేరకు చర్చలు జరిపారు. మేజర్ మల్టీఫ్లెక్స్ చైన్స్ లో పొన్నియన్ సెల్వన్ టికెట్ ధర వంద రూపాయలు ఉండేలా చూడాలని అభ్యర్ధించారు. మణిరత్నం విన్నపానికి థియేటర్స్ ఓనర్స్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధిక టికెట్స్ ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు. ఈ కారణంగా భారీ చిత్రాలు కనీస వసూళ్లను రాబట్టలేక చతికిలబడ్డాయి. ఈ క్రమంలో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మూవీ టికెట్ ధర వంద రూపాయలుగా నిర్ణయించాడు.
మరి ఆ ధర కేవలం హిందీ వర్షన్ కా లేక అన్ని భాషలకు వర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఓటీటీ ప్రభావం అధికమైన నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం లేదు. అలాగే పెరిగిన టికెట్స్ ధరల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేల రూపాయలు ఖర్చు చేయలేక వెనకాడుతున్నారు. అలాగే ఒక నెలరోజుల తర్వాత ఓటీటీ లో చూడొచ్చని అభిప్రాయానికి వస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల కానుంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభుతో పాటు పలువురు కోలీవుడ్ స్టార్స్ పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మించాయి. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చోళుల చరిత్రగా పొన్నియిన్ సెల్వన్ తెరకెక్కింది. మరి ఈ కథ మిగతా భాషల ఆడియన్స్ కి ఎంత వరకు ఎక్కుతుందో చూడాలి. మణిరత్నం ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Also Read: Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’: అసలు కథేంటి? ఎవరు ఏ పాత్రలు పోషించారంటే?