Chicken Rates : ముక్కలేనిదే ముద్ద దిగదు..’ మాంసం ప్రియులు తరుచూ అనే మాటనే కదా.. ఎంత మాంసం ప్రియులైనా భక్తి కూడా ఉంటుంది కదా.. అదే మన సంస్కృతిలోని స్పెషల్ ఎఫెక్ట్. అందుకే దాదాపు నెల రోజులుగా ముక్క (మాంసం)కు దూరంగా ఉన్న వారు ఇప్పుడు మొదలు ఆనందంగా లాగించనున్నారు. గత నెల (నవంబర్) కార్తీక మాసం (పరమ శివుడికి ఇష్టమైన మాసం) కావడంతో శివ భక్తులతో పాటు నెల రోజులు మాంసం తినడం మానేస్తామని మొక్కులు మొక్కుకున్న వారు మాంసం తినడం మాని వేశారు. దీంతో చికెన్, మటన్ వ్యాపారాలు భారీగా పడిపోయాయి. రేట్లు తగ్గడంతో నిర్వాహకులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. నెల రోజులు ఎలా గడుస్తుందోనని ఎదురు చూశారు. ఇక నెల రోజులు గడిచింది. నిన్నటితో (డిసెంబర్ 1)తో కార్తీక మాసం పూర్తయింది. దీంతో చికెన్, మటన్, ఫిష్ ఇలా మాంసానికి సంబంధించి అమ్మకాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో పుంజుకున్నాయని మరింత పుంజుకునే ఛాన్స్ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. బాయిలర్, ఫారం కోళ్లు, మేకలు, జాలారులు వ్యాపారం లేక నెలపాటు బాధలు పడ్డారు. ఇక సోమవారం నుంచి కార్తీక మాసం పూర్తయ్యింది. దీంతో దావతులు పెరిగుతాయి.
ఇక ఈ నెలలోనే క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకలు ఉండడంతో మాంసానికి డిమాండ్ బాగానే పెరుగుతుందని వ్యాపారులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కు తగ్గట్లే సరఫరాను పెంచాలని చూస్తున్నామని ఒక బాయిలర్ వ్యాపారి తెలపగా.. ఈ నెలలో రెండు వేడుకలతో పాటు ఐదు ఆదివారాలు కూడా వచ్చాయి. ప్రతీ వారం కలిసి వస్తుందని చికెన్ సెంటర్ వ్యాపారులు అంటున్నారు.
వీటికి అనుగుణంగానే ధరలను కూడా పెంచుతామని వ్యాపారుల నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇది కనుక జరిగితే కిలో చికెన్ ధర రూ. 300కు పైగా దాటవచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం కిలోకు రూ. 200 నుంచి రూ. 220 వరకు ఉంది. ఇక పెరిగితే ఆ ధర రూ. 300 లేదంటే అంతకంటే పైకి ఎగబాకచ్చని చెప్తున్నారు. ఇక కోడిగుడ్లకు కూడా అదే మార్జిన్ లో పెరిగే ఛాన్స్ ఉంది లేయర్ వ్యాపారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కోడి గుడ్డు ధర హోల్ సేల్ మార్కెట్ లో రూ. 5.90 ఉంటే రిటైల్ లో రూ. 7 వరకు ఉంది. ఇది దాదాపుగా రూపాయి నుంచి 2 రూపాయల వరకు పెరగవచ్చని తెలుస్తుంది.
ఏది ఏమైనా నెల పాటు ముక్కకు దూరంగా ఉన్న వారు మళ్లీ ముక్క ముట్టడంతో అందరూ ఆనందంగానే ఉన్నారు. ముఖ్యంగా ముక్కల వ్యాపారులు మరింత ఆనంద పడుతున్నారు. ఆ మహా శివుడి దయ వలన ఈ నెల వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నారు.