Deepavali 2023: సాధారణంగా పండుగలు అంటేనే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. అందులో దీపావళి అంటే చెప్పనక్కర్లేదు. బాణసంచా వెలుగుల్లో దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.మరి అదే దీపావళి పేరుతో గ్రామాలు ఉంటే అది ప్రత్యేకమే కదా? శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం
శ్రీకాకుళం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో.. గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. శ్రీకాకుళం ప్రాంతాన్ని పాలించిన కళింగరాజు గార మండలంలో ఈ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. రాజు ప్రతిరోజు గుర్రంపై శ్రీకాకుళం నుంచి కళింగపట్నం వరకు ఉన్న మట్టి రోడ్డు గుండా వెళ్తుండే వారట. మార్గమధ్యంలో శ్రీకూర్మం సమీపంలో లక్ష్మీనారాయణ గుడి వద్ద ఆగి స్వామివారిని దర్శించుకునేవారు. అనంతరం కళింగపట్నం వెళ్లి తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో సైతం స్వామివారిని దర్శించుకునేవారు. ఒకరోజు గుర్రంపై వెళ్లి వస్తుండగా గుడి వద్దకు వచ్చేసరికి సోమసిల్లి పడిపోయారు. లక్ష్మీనారాయణ గుడి వద్ద ఉన్న వైష్ణవులు, గోవుల కాపరులు రాజుకి సపర్యాలు చేసి గుడి వద్దనున్న బావిలో నీరుని తాగించారు. రాజు మేల్కొని సపర్యలు చేసిన వారి ఊరు పేరు అడుగగా.. తమ ఊరికి పేరు లేదని వారు చెబుతారు. ఈ సంఘటన దీపావళి నాడు జరగడంతో.. దీపావళి పేరును ఆ ఊరికి పెట్టారని… రికార్డుల్లో కూడా దీపావళిగా నమోదు చేస్తామని చెప్పి.. అప్పటివరకు ఉన్న పనులన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ రాజు ప్రకటించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి శతాబ్దాలుగా ఆ గ్రామానికి అదే పేరు కొనసాగుతోంది.
టెక్కలి మండలం అయోధ్య పురం పంచాయతీలో దీపావళి అనే గ్రామం ఉంది. సుమారు 50 కుటుంబాలు అక్కడ నివసిస్తుంటాయి. దశాబ్ద కాలం కిందట ఏర్పాటైన ఈ గ్రామానికి గ్రామ పెద్దలు దీపావళి అని పేరు పెట్టారు. అప్పటినుంచి అదే పేరుతో కొనసాగుతోంది. దీపావళిని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హిందువులకు ముఖ్యమైన పండుగ దీపావళి పేరును తమ గ్రామానికి ఉండడం చాలా ఆనందంగా ఉంటుందని గ్రామస్తులు సగర్వంగా చెబుతుంటారు. అటువంటి గ్రామంలో జన్మించడం చాలా సంతోషకరమని, గుర్తింపు లభిస్తుందని గ్రామ యువకులు వ్యాఖ్యానిస్తుంటారు.