Gangula Kamalakar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో భారీగా నామినేషన్లు పడ్డాయి. ఒక్కరోజే 1129 నామినేషన్లు రాష్ట్రవ్యాప్తగా దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే.. నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ ఆస్తులు, కేసులపైనా అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇందులో తెలంగాణలోనే మంత్రి గంగుల కమలాకర్ అఫిడవిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బంగారు ‘కొండ’
గంగుల కమలాకర్ అంటేనే గుట్టలు, కొండలు అన్న నానుడి ఉంది. ఎందుకంటే కరీంనగర్ చుట్టూ ఉన్న కొండలను 15 ఏళ్లుగా కరగదీస్తున్నారు ఆయన. గ్రానైట్ వ్యాపారంతో కొండలన్నీ దాదాపు కనుమరుగయ్యాయి. ప్రకృతి విధ్వంసం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మొత్తుకున్నా పట్టించుకునేవారు లేదు. గంగుల కమలాకర్ మాత్రం భూమిపై ఉన్న కొండలతోపాటు భూమిలోపలి నుంచి కూడా గుట్టలను పెకిలిస్తున్నారు. ఆర్థికంగా ఎదిగారు. ఒక క్వారీ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. మంత్రిపై పన్ను ఎగవేత కేసు ఉంది. ఈవిషయమై ఇటీవల ఐటీ, ఈడీ దాడులు కూడా జరిగాయి. అయితే తాజాగా ఆయన బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద కిలోల కొద్దీ బంగారం ఉన్నట్లు ప్రకటించారు. దీంతో గంగల అంటే బంగారు కొండ అన్న చర్చ జరుగుతోంది.
అఫిడవిట్‌లో ఏముందంటే..
కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ తన నామినేషన్‌లో సమ్పరించిన అఫిడవిట్ ను చూసిన వారు నివ్వెరపోతున్నారు. గంగుల ఈ అఫిడవిట్‌లో తనకు రూ.2 కోట్ల విలువైన 436 తులాల బంగారం, రూ. 80 వేలు విలువైన కేజీ వెండి ఉన్నట్లు తెలిపారు. ఇక తన భార్యకు రూ.4 .50 కోట్ల విలువైన 800 తులాల బంగారం, కేజీ వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన కూతురుకి రూ. 14 లక్షల విలువ కలిగిన 25 తులాల బంగారం ఉందని నామినేషన్‌లో వెల్లడించారు.
నెట్టింట్లో వైరల్..
గంగుల కమలాకర్ బంగారం వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. గంగుల గుట్టలనే కాదు.. బంగారాన్ని మింగేస్తున్నారు అని కొందరు.. బంగారు కొండ గంగుల అని మరికొందరు.. గోల్డ్ మెన్ ఆఫ్ తెలంగాణ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.