కంచే చేను మేస్తోందా? కన్న తండ్రులే కూతుళ్లను చెరచడం చూస్తున్నాం. దేశంలో ఇలాంటి ఘటనలు పలు చోటుచేసుకుంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిలా మారి కూతురి శీలాన్ని చెడగొట్టాలని చూడడం దారుణం. రెప్పే కాటు వేయడానికి యత్నించడం గమనార్హం. ఆడపిల్లల రక్షణ కోసం అనేక చట్టాలున్నా వారిని కాపాడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశం అవుతోంది. తనపై అత్యాచారానికి ప్రయత్నించిన తండ్రిని కడతేర్చి తన శీలాన్ని కాపాడుకుంది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్ పురాయూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ దివ్యాంగుడు. ఆయన భార్య ఇటీవల మరణించింది. దీంతో తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తున్నాడు. పెద్ద కూతురు షాపింగ్ మాల్ లో పని చేస్తుంది. చిన్న కూతురు తండ్రితోనే ఉంటోంది. ఈ క్రమంలో అతడు మానవ మృగంగా మారి కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడాలని భావించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది.
అయినా వినకపోవడంతో హతమార్చింది. కానీ పోలీసులకు చెప్పలేదు. ఈ నేపథ్యంలో అతడు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడంతో ఇది రాజకీయ హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. కన్నతండ్రిని కూతురే హతమార్చిందని తెలుసుకుని హతాశులయ్యారు.
ఈ సందర్భంగా బాలిక ఆత్మరక్షణ కోసమే తండ్రిని హత్య చేసిందని రికార్డు చేశారు. ఇదే విషయాన్ని డీఎస్పీ ఇళంగోవన్ తెలిపారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీనాథ సానుకూలంగా స్పందించారు. ఆత్మరక్షణ కోసం హత్య చేసిన ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.