Pawan Kalyan vs YSRCP: ‘కులం’ నీకు ఏమిచ్చిందంటే.. కొట్టుకోవడానికి మనుషులను ఇచ్చింది. మానవత్వం మరిచి విమర్శించుకోవడానికి నోరు ఇచ్చింది.. ఆధిపత్యం చాటడానికి అధికారమిచ్చింది. దేశంలోనే కులాలు, మతాలంతా పవర్ ఫుల్ మరొకటి కాదు.. దేశంలో ప్రస్తుతం ఈ పోకడలు ఎక్కువైపోయాయి. కులాలతోనే రాజకీయం నడుస్తున్న పరిస్థితులున్నాయి.

ముఖ్యంగా గత చంద్రబాబు పాలనలో ఈ కుల రాజకీయం మొదలైందని చెబుతారు. రాజకీయాలను కులాలు, సామాజికవర్గాలతో విభజించడం ఆయనే మొదలుపెట్టారనే విమర్శలున్నాయి. సవాల్ చేసే ఆ కుల నేతను అదే కులస్థుడితో తిట్టించడం.. వారి కులంలోంచే విప్లవాలు లేవదీసి అణిచివేయడం ఆయన అవలంభించారని రాజకీయవర్గాల్లో ఓ విమర్శ ఉంది.. ఇప్పుడు దాన్నే మన అధికార వైసీపీ అవలంభిస్తోందని అంటున్నారు.
ప్రతి రాజకీయ నాయకుడి ఎదుగుదల వెనుక ఖచ్చితంగా అతడి సామాజికవర్గం ఉంటుంది. ఇక కులాల కుంపంట్లు ఎక్కువగా ఉండే ఏపీలో అయితే ఈ వేడి ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆ వర్గం అండతో నేతలు రాజకీయంగా ఎదుగుతారనేది అందరికీ తెలిసిందే. ఆ వర్గం ప్రజలు తమ వర్గం వారినే గెలిపించి ఆనందిస్తారు.
ఏపీ రాజకీయాలు చూస్తే ప్రధానంగా రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు రాజకీయాలను శాసించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఈ రెండు వర్గాలకు మించి జనాభా ఉన్న కాపులు బలంగా పుంజుకోవాలని ఎప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా వారిలో అనైక్యత వెనక్కి లాగుతోంది. పవన్ కళ్యాణ్ ఉన్నా రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. పవన్ సైతం పెద్దగా కులాల పట్టింపులతో ముందుకు వెళ్లడం లేదు. దీంతో కాపులకు రాజ్యాధికారం అన్నది అందని ద్రాక్షే అవుతోంది.
ఏపీలో దళితులు, కాపులే అత్యధికంగా ఉన్నారు. తాజాగా ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో కాపు అయిన పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తాజాగా బీసీ మంత్రులు, కాపు మంత్రులే కౌంటర్ ఇవ్వడం విశేషం. నిజానికి ఏపీలో ఎవరైనా సరే జగన్ ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేస్తే ముందుకు దూసుకు వచ్చేది రెడ్డి నేతలే.. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా సహా రెడ్డి నేతలు మీద పడిపోతారు. కానీ ఇక్కడ కాపు అయిన పవన్ వ్యాఖ్యలు చేయగానే కౌంటర్ ఇవ్వడానికి ఏ రెడ్డి నేత ముందుకు రాలేదు. ఎందుకంటే ఏపీలో ప్రబలంగా కాపు సామాజికవర్గం ఉంది. వారు రాజకీయాలను శాసించేలా ఉన్నారు. రెడ్డి, కమ్మలు చాలా తక్కువ. ఈ క్రమంలోనే కాపు అయిన పవన్ పై రెడ్డిల దాడిగా చిత్రీకరించే ప్రమాదం ఉంది. అగ్రవర్ణాలను బీసీలను అణిచివేస్తున్నారని ప్రచారం చేయొచ్చు. అందుకే వ్యూహాత్మకంగానే వైసీపీ రెడ్డి నేతలు వెనక్కి వెళ్లి వైసీపీలోని బీసీ , కాపు మంత్రులు అయిన అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు ముందుకొచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు.
నాడు చంద్రబాబు కూడా ఇలానే కుల రాజకీయాలను వాళ్ల సామాజికవర్గం నేతలను ఉసిగొల్పి ప్రత్యర్థులను పలుచన చేసేవారు. ఇప్పుడు జగన్ కూడా తమ చేతికి మట్టి అంటకుండా ఎవరు తిడుతారో.. ఆ సామాజికవర్గం నేతలను ముందునిలిపి వెనుకుండి మంత్రాంగం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషపు కుల రాజకీయాల్లో ఆ సామాజికవర్గమే రెండుగా చీలిపోతుందన్న విషయం తెలియక వాళ్లకు వాళ్లే తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా ఒక సామాజికవర్గం నేతలంతా కలిసి ఉంటే వారికి రాజ్యాధికారం… కానీ.. బలమైన రెడ్లు, కమ్మల చేతుల్లో బందీ అయిన కాపు, బీసీ నేతలు తోలుబొమ్మల్లా ఆడుతూ సొంత సామాజికవర్గంపైనే దాడి చేస్తున్నారు. తద్వారా తమలో తాము క్షీణింపచేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ దాడిలో కాపు, బీసీ మంత్రులు ముందుకొచ్చి తిట్టడం.. ‘రెడ్డి నేతల మౌనం’ ఇందుకు ప్రధాన ఉదాహరణగా కనిపిస్తోంది.