https://oktelugu.com/

Cyclone Alert: ఏపీకి తుఫాను గండం.. దూసుకొస్తున్న ‘మోచా’.. ఆ పేరెలా వచ్చింది.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతుండటంతో మరికొన్ని రోజులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : May 7, 2023 11:21 am
    Follow us on

    Cyclone Alert: అకాల వర్షాలకు సతమతమవుతున్న రైతులకు తుఫాను రూపంలో మరో గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణా బలపడుతోందని వాతావారణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఇబ్బంది లేదని, జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫానుకు ‘మోచా’గా నామకరణం చేశారు.
    సాధారణంగా ప్రతి ఏటా మే నెలలో విపరీతమైన ఎండలు కాస్తాయి. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. కానీ, గత వారం రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు చివరి దశలో ఉన్నాయి. సాగునీరు అందుబాటులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా వరి పంటలను కోసి నూర్పిళ్లు వేశారు. చాలా చోట్ల ఎక్కువ శాతం పంటలు పొలంలోనే ఉన్నాయి. మరికొద్ది రోజులు గడిస్తే చాలని అనుకుంటున్న సమయంలో వర్షాలు ముంచెత్తడంతో రైతులు అల్లాడిపోతున్నారు.
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారుతుండటంతో మరికొన్ని రోజులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నై తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
    శనివారం ఏలూరు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతి, పల్నాడు, శ్రీకాకుళం, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి. ఆదివారం కృష్ణా, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
    సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కాగా, ప్రతి ఏటా ఏర్పడుతున్న తుఫాన్లకు డబ్ల్యూఎంవోలోని భాగస్వామ్య దేశాలు నామీకరణ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫానుకు యెమన్ దేశం పేరు పెట్టింది. మోచా లేదా మోఖా అనే పేర్లతో దీనిని పిలవవచ్చు. మోచా అంటే చాక్లెట్ ఫేవర్లలోని ఒక రకం కాఫీ పానీయం. మోఖా అంటే యెమన్ లోని ఎర్ర సముద్ర తీర ప్రాంత నగరం. స్పెల్లింగ్ ను బట్టి ఎలా అయినా పిలవచ్చు.
    తుఫాను ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఏపీలో తుఫాను విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. వెళ్లినవారు వెంటనే తిరిగిరావాలని హెచ్చరికలు జారీచేస్తున్నారు. సమాచారం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.