Cottonmouth Snake Eats Python In Florida : సాధారణంగా కొండ చిలువలు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కన మింగేస్తాయి. మనుషులను కూడా మింగిన కొండ చిలువలను మనం చూశాం. జంతువులను కూడా మింగేస్తుంటాయి. ఎంత పెద్ద జంతువునైనా మింగేసి అరిగించుకోగల సామర్థ్యం కొండ చిలువ సొంతం. అదిచుట్టు చుట్టిందంటే తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. ఓ సాధారణ పాము ఏకంగా కొండ చిలువనే మింగేసింది. ఇదో వింతగా మారింది.

సాధారణంగా పాములను కొండ చిలువలు మింగేస్తుంటాయి. కానీ ఇక్కడ పాము ఆ పని చేసింది. పాములు సాధారణంగా కప్పలు, ఎలుకలను పట్టుకొని మింగేస్తుంటాయి. అమెరికాలో ఓ పాము మాత్రం భారీ కొండ చిలువను మింగేసింది. ఆశ్చర్యంగా ఉన్న ఇది చూసి జూ అధికారులు కూడా షాక్ తిన్నారు.
అమెరికాలోని ఫ్లోరిడాలోని జూ మియామీలో ఈ వింత జరిగింది. వాటర్ మొకాసిన్ పాము .. బర్మీస్ పైథాన్ ను అమాంతం మింగేసింది. మొకాసిస్ పాము కదలకుండా అలానే ఉండడం.. కొండ చిలువ కనిపించకపోవడంతో వెతికారు. ఆ కొండచిలువకు గతంలో అమర్చిన ట్రాన్స్ మీటర్ సహాయంతో దాని కదలికలను ఎప్పటికప్పుడు జూ అధికారులు గమనిస్తుంటారు. కొండ చిలువ కనిపించకపోవడంతో ఆ ట్రాన్స్ మీటర్ ను ట్రాక్ చేశారు.
ఆ కొండ చిలువను ఆ పాము మింగేసిందని.. దాని కడుపులో ఉందని జూ అధికారులు గుర్తించారు. కాటన్ మౌత్ లేదంటే వాటర్ మొకాసిన్ గా పిలిచే ఈపాము ఏకంగా కొండచిలువనే మింగేసిందని తేలింది. తాజాగా జూ అధికారులు పామును ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్ రే తీయగా పాము లోపల కొండ చిలువ వెన్నెముకతోపాటు దానికి అమర్చిన ట్రాన్స్ మీటర్ కూడా కనిపించింది. ఈ వింతను చూసి జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. కొండచిలువ నే మింగేయగల పాము ఒకటుందని ప్రపంచానికి తెలిసింది.
ఆ కొండ చిలువ ఈ ఏడాదే పుట్టింది. బర్మీస్ పైతాన్ ట్రాకింగ్ కోసం ట్రాన్స్ మీటర్ ను అధికారులు అమర్చారు. అయితే కొండ చిలువ కనిపించకపోవడం.. ఒక పాము పొట్ట ఉబ్బు ఉండడం చూసి ట్రాక్ చేయగా.. దాని పొట్టలోనే కొండ చిలువ ఉన్నట్టు తేలింది. ఎక్స్ రే తీసిన అనంతరం ఆ పామును అధికారులు అడవిలోకి వదిలారు. సుమారు 25 రోజుల తర్వాత ఆ పాము కడుపులోని ట్రాకింగ్ పరికరాన్ని విసర్జించింది. ప్రస్తుతం ఈ పాము ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.