Sankranti Movies 2023: చైనాలో కోవిడ్ విజృంభిస్తున్నది. కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. ప్రభుత్వం చేతులెత్తేయడంతో కోవిడ్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది. అయితే మనదేశంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ కేంద్రం చేస్తున్న హెచ్చరికలు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి.. గతంలో ఎదుర్కొన్న పరిస్థితులనే మళ్లీ చవిచూడాల్సి వస్తుందేమో నన్న భయం ప్రజలను వెంటాడుతోంది.. ఇక కేంద్రం కూడా మాస్క్ తప్పనిసరి అని నిబంధన అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది.. అయితే కోవిడ్ మళ్ళీ విజృంభిస్తే దీని ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది.. ముఖ్యంగా సంక్రాంతి పై కోటి ఆశలు పెట్టుకున్న సినిమా రంగంపై మరింత తీవ్రంగా ఉంటుంది.

పెద్ద సినిమాలపై దెబ్బే
ఇప్పటికీ ఉత్తరాంధ్ర సినీ మార్కెట్ కోలుకోలేదు.. కోవిడ్ తగ్గిపోయి సాధారణ పరిస్థితి ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ అక్కడ ఎటువంటి మార్పు లేదు.. ఇలాంటి సమయంలోనే మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సినీ నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.. ఇక తెలుగువారి ప్రధాన పండుగ అయిన సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అందులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి, యు వి క్రియేషన్స్ సంతోష్ శోభన్ సినిమా, దిల్ రాజు వారసుడు, తమిళ హీరో అజిత్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ఆధారంగా కోట్ల వ్యాపారం జరుగుతున్నది. అయితే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా మారాలంటే ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి.. వారు థియేటర్ గడప తొక్కాలి అనుకుంటే బయట పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలి..
ఈసారి కూడా తప్పదా
గత రెండేళ్లుగా పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు.. కోవిడ్ వల్ల అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.. ఆ ప్రభావాన్ని మరింత ఎక్కువ చవిచూసిన రంగం సినిమా.. ఓటిటిల వల్ల ఈ గ్యాప్ కొంత తగ్గినా.. అది పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ఎందుకంటే ప్రేక్షకుడికి, సినిమా థియేటర్ కి ఉన్న కనెక్టివిటీ అటువంటిది.. కోవిడ్ తగ్గి దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నప్పటికీ… ఇప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాలో మార్కెట్ పుంజుకోలేదు. ఇది ఎప్పుడు గాడిలో పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఇది ఇలా ఉండగానే ఇప్పుడు కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తుందనే సంకేతాలు నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. బయటికి కనిపించడం లేదు గాని వారు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవితో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కావలసి ఉంది.. రెండు సినిమాల మీద కోట్లల్లో వ్యాపారం జరిగింది.. మరి ఇదంతా రికవరీ కావాలంటే సినిమా థియేటర్లు తెరుచుకోవాలి. కానీ ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలవుతుందనే వార్తల నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని నిర్మాతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు..

ఇప్పటికే థియేటర్ల సమస్య
మొన్నటిదాకా సంక్రాంతి బరిలో ఐదు పెద్ద సినిమాలు ఉంటాయని టాక్ నడిచింది.. అయితే రికవరీ కష్టం కాబట్టి రెండు సినిమాలు వెనక్కి వెళ్ళాయి.. కానీ ఈ పోటీలో అజిత్, సంతోష్ శోభన్ సినిమాలు తెరపైకి వచ్చాయి.. అయితే వీటికి థియేటర్లు సర్దుబాటు చేయడం నిర్మాతలకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది.. మొత్తానికి అనేక చర్చల తర్వాత ఈ తతంగం ముగిసినప్పటికీ ఇప్పుడు కోవిడ్ భయాల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోవడం లేదని నిర్మాతలు అంటున్నారు.. ఇప్పటికే వడ్డీల భారం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిర్మాతలు… ఒకవేళ కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంటే నిండా మునిగిపోవడం ఖాయం.