Kerala Bank: బాధ్యతగా పనిచేయవలసిన బ్యాంక్ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. ఖాతాల వివరాలను ఒకటికి పది సార్లు చెక్ చేసుకునే సిబ్బంది మాకెందుకులే అనుకున్నారు.. సీన్ కట్ చేస్తే 2.44 కోట్లు కొందరి యువకుల ఖాతాలో జమయ్యాయి.. ఇది ఇప్పుడు కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఇదీ జరిగింది
మన పెద్దలు కష్టే ఫలి అంటారు.. కానీ ఇప్పటికీ మెజారిటీ ప్రజలకు కష్టపడి పైకి రావడం కంటే… షార్ట్ కట్ లో ఎదగడం అంటేనే ఇష్టం.. డబ్బు సంపాదించాలి.. అది కూడా చెమట చుక్క చిందించకుండా. సకల వైభోగాలను అనుభవించాలి.. స్వర్గం చివరి అంచులను చూడాలి.. అందుకే కదా సమాజంలో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఇక దేశంలో జరుగుతున్న నేరాల్లో సింహభాగం డబ్బుతో ముడిపడి ఉన్నవే. సరే ఈ విషయాలు పక్కన పెడితే కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో ఓ బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు..2.44 కోట్లను కొందరి యువకుల ఖాతాలో వేశారు.. వారు అందరిలాంటి యువకులైతే బాగానే ఉండేది.. కానీ ఒకసారి గా తమ జీవితంలో ఎప్పుడూ చూడని డబ్బు ఖాతాలో కనిపించేసరికి వారి కోరికలకు రెక్కలు వచ్చాయి.. ఇంకేముంది విలాసవంతమైన జీవితానికి శ్రీకారం చుట్టారు.
ఇలా బయటపడింది
మొదట్లో ఈ వ్యవహారాన్ని బ్యాంకు అధికారులు గోప్యంగా ఉంచారు.. అయితే ఆడిటింగ్ లో వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు చివాట్లు పెట్టారు. వారు తలంటే దాకా సిబ్బంది మేల్కోలేదంటే వారు ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, ఉద్యోగం పోతుందేమోనన్న భయం… మొత్తానికి సిబ్బంది తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం మొదలుపెట్టారు.. ఈ నగదును నిధిన్, మను అనే యువకుల ఖాతాలో జమ చేసినట్టు గుర్తించారు.. అయితే వారి వద్ద నుంచి డబ్బు రికవరీ చేయాలంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది.. ఇందులో భాగంగానే బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారికి ఇందుకు సంబంధించిన ఆధారాలు మొత్తం సమర్పించారు.

పోలీసుల ఎంట్రీ తో..
బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆధారాల ఆధారంగా త్రిసూర్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ఆ డబ్బులతో ఖరీదైన ఫోన్లు, బంగారు వస్తువులు కొనుగోలు చేశారు.. కొంత నగదు తో తమ వ్యక్తిగత రుణాలు తీర్చారు.. కొంత డబ్బును షేర్ మార్కెట్లో మదుపు చేసేందుకు ఉపయోగించారు. ఇక మిగిలిన మొత్తాన్ని 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేశారు.. అయితే బ్యాంకు నుంచి డబ్బులు వేరే ఖాతాలోకి వెళ్ళాయని గుర్తించిన అధికారులు… పోలీసులకు ఈ విషయాన్ని ఉప్పందించారు.. అయితే నిందితులకు ఖాతా ఉన్న బ్యాంకు మరో బ్యాంకులో విలీనం కావడంతో సర్వర్ లో సమస్య ఏర్పడి డబ్బులు వారి ఖాతాలో పడినట్టు సిబ్బంది చెప్తున్నారు.. ఇందులో సర్వర్ సమస్య తెరపైకి కనిపిస్తున్నప్పటికీ… సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు దర్శనమిస్తోంది.. అయితే నిందితులు తమకున్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బ్యాంకు సర్వర్లను తారుమారు చేసి డబ్బులు స్వాహా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.. కాగా ఈ ఘటన కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.