https://oktelugu.com/

Cognizant: పేరులోనే గొప్ప.. జీతంలో కూలీలకన్నా అధ్వానం.. ఆ ఐటీ కంపెనీని ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!

లక్షల్లో వేతనం.. చొక్కా నలగని ఉద్యోగం.. క్యాప్‌ సదుపాయం.. వారానికి ఐదు రోజులే పని.. ఇంటి వద్ద కూడా చేసుకునే సదుపాయం.. ఐటీ జాబ్‌ అనేగానే గుర్తొచ్చే అంశాలు ఇవీ. కానీ ఆర్థిక మాంద్యం దెబ్బకు ఐటీ కంపెనీలు కూడా కుదేలవులున్నాయి. ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటిస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 14, 2024 / 04:48 PM IST

    Cognizant

    Follow us on

    Cognizant: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే లక్ష్యల్లో జీతం ఉంటుంది. ఒక్కసారి ఉద్యోగం వస్తే లైఫ్‌ సెటిల్‌ అయినట్లే అని భావిస్తారు చాలా మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కాలం మారింది. ఆర్థిక మాంద్యం దెబ్బ.. యువతలో నైపుణ్యం కొరవడడం కారణంగా ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాయల జీతంతో జాయిన్‌ అయినవారు కూడా ఇప్పుడు ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. గూగుల్, అమెజాన్, విప్రో, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి పెద్ద సంస్థలు కూడా ఉద్యోగాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మన దేశంలో కూడా చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఐటీ ఫ్రొఫెషనల్స్‌ పొట్ట చేత పట్టుకుని రోడ్డున పడుతన్నారు. ఇన్నాళ్లూ చేతినిండా డబ్బులతో హైఫై లైఫ్‌ ఎంజాయ్‌ చేసినవాళ్లు కూడా ఇప్పడు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటి అయిన కాగ్నిజెంట్‌ ఐటీ నిపుణులకు మరో షాక్‌ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన జాబ్‌ నోటిఫికేషన్‌లో వార్షిక వేతనం కేవలం రూ.2.5 లక్షలుగా ప్రకటించింది. అంటే నెలకు కేవలం రూ.20 వేలు అన్నమాట.

    ఇటీవలే జాబ్‌ ఆఫర్లు..
    చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉంటే.. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇటీవల జాబ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెద్ద కంపెనీగా గుర్తింపు ఉన్న ఆ సంస్థ వేతన ప్యాకేజీ చూసి నెటిజన్లు, ఐటీ ప్రొఫెషనల్స్‌ షాక్‌ అవుతున్నారు. నెట్టింట్లో తెగ ట్రోల్‌ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఫ్రెషర్లకు సంవత్సరానికి రూ.2.5 లక్షల ప్యాకేజీ ప్రకటించడమే ట్రోల్స్‌కి కారణం. కాగ్నిజెంట్‌ తీరుపై మండిపడుతున్నారు.

    ఫ్రెషర్స్‌కు ఆహ్వానం..
    కాగ్నిజెంట్‌ తాజా నోటిఫికేషన్‌లో 2024 లో డిగ్రీ పూర్తి చేసిన ఐటీ ఫ్రొఫెనర్ల నుంచి ఆఫ్‌ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది . 2024, ఆగస్టు 14న ఈ రిక్రూట్‌మెంట్‌ అప్లికేషన్లకు తుది గడువుగా పేర్కొంది. ఈ జాబ్‌ ఆఫర్‌కి సంబంధించి ఇండియన్‌ టెక్‌ అండ్‌ ఇన్‌ఫ్రా అనే పేరుతో ఉన్న సోషల్‌ మీడియా ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఆగస్టు 13 వ తేదీన ఈ జాబ్‌ ఆఫర్‌ పోస్ట్‌ చేశారు. ఒక్క రోజులోనే ఏకంగా 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ రావడం గమనార్హం. కాగ్నిజెంట్‌ చేసిన జాబ్‌ ఆఫర్‌పై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు.

    కూలీ కన్నా తక్కువ జీతం..
    కాగ్నిజెంట్‌ జాబ్‌ ప్యాకేజీ రూ.2.5 లక్షలు. అంటే నెలకు ఉద్యోగి వేతనం రూ.20 వేలు మాత్రమే. ఒక పని మనిషి ఒక్కో ఇంట్లో రోజుకు సగటున అరగంట పని చేసినా 8– 10 ఇళ్లలో పని చేస్తే నెలకు కాగ్నిజెంట్‌లో పనిచేసే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తుంది అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఐటీ ఉద్యోగం చేసే కంటే ట్యూషన్లు చెప్పినా ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుందంటూ మరో యూజర్‌ రాసుకొచ్చాడు. తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు విక్రయించే వారు సైతం ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారంటూ మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. ఈ ప్యాకేజీలో మెట్రో నగరాల్లో ఏం చేయాలో చెప్పాలంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు.