Producer Bunny Vasu: ఒకప్పుడు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ పిలిచేవారు కాదు. అందరినీ కలిపి మెగా ఫ్యామిలీ అని మాత్రమే సంబోధించేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, ఎవరికి వారు సొంతంగా ఎదగాలని చూస్తున్నారని, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్తాపించినప్పటి నుండి ఈ గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియా లో వినిపించే వార్త. అంతే కాకుండా అల్లు అర్జున్ వైసీపీ పార్టీ కి చెందిన శిల్పా రవి అనే వ్యక్తి కోసం నంద్యాల కి వెళ్లి గెలిపించామని కోరడంతో కచ్చితంగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరిగాయని అనుకుంటున్నారు. కానీ ఈ రెండు ఫ్యామిలీలను అభిమానించే వారు ఎంతోమంది ఉంటారు.
వాళ్ళు ఈ రెండు కుటుంబాలలో ఏ కుటుంబం వైపు నిలబడాలి అంటే చెప్పలేరు. అలాంటి వారిలో ఒకరు బన్నీ వాసు. ఈయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని, గీత ఆర్ట్స్ లో చిన్న స్థాయి నుండి నేడు సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ కూడా ఆయన జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీ బిజీ గా ఉంటాడు. అయితే రీసెంట్ గా ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘ఆయ్’ అనే చిత్రం ఆగస్టు 15 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిపించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల విచ్చేసింది. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు అల్లు అర్జున్ గురించి తల్చుకుంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘అడగనిదే అమ్మ అయిన అన్నం పెట్టదు అని అంటూ ఉంటారు. కానీ నేను అడగకముందే నా అవసరాన్ని గమనించి సహాయం చేసే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే. అందుకే నా జీవితం లో మా అమ్మ తర్వాత నేను ఎక్కువగా అల్లు అర్జున్ కి ప్రాధాన్యత ఇస్తాను. అందరూ ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు. స్నేహితుడికి సహాయం అవసరమైతే అందరికంటే ముందు స్పందించేది అల్లు అర్జున్ గారు మాత్రమే. ‘ఆయ్’ చిత్రం ప్రొమోషన్స్ సరిగా చెయ్యడం లేదని నా సన్నిహితులు నాతో చెప్తూ, అల్లు అర్జున్ చేత ట్వీట్ వేయించామని అడిగారు. ఈ విషయం నేను అల్లు అర్జున్ గారి దాకా తీసుకొని వెళ్ళలేదు కానీ, నా అవసరాన్ని గమనించి ఆయనే ట్వీట్ చేసాడు. నా మీద ఆయన చూపించిన ప్రేమని చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి . అంతే కాదు ఒకానొక సందర్భం లో నేను గీత ఆర్ట్స్ నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే అల్లు అర్జున్ నాకు సపోర్టు గా నిలబడి అల్లు అరవింద్ గారితో గొడవపడ్డారు. ఆ రోజు నేను మర్చిపోలేను, ఆయన వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.