Homeట్రెండింగ్ న్యూస్CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఇంత ధైర్యమేంటి? ఇంత మొండిగా ఎందుకు వెళుతున్నాడు?

CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి ఇంత ధైర్యమేంటి? ఇంత మొండిగా ఎందుకు వెళుతున్నాడు?

CM Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి.. తన ప్రమేయం ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని.. అరెస్ట్ కంటే ముందు అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారని రేవంత్ వివరించారు. ఆ తర్వాత రేవంత్ అంతటితోనే ఆగలేదు. ఢిల్లీలో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఆయన ఏమైనా సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? నాలుగు సినిమాలు చేశాడు.. అందులో పెట్టుబడి పెట్టాడు.. అంతకంటే ఎక్కువ పైసలు సంపాదించాడు. ఇవాళ ఏదో ఆయన అరెస్టు ను రకరకాలుగా చిత్రీకరించడం సరికాదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మీడియాలో సంచలనం నమోదయింది. మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని పక్కనపెట్టి.. అతడికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం మానేసి.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టింది. మొదట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత అతడేమైనా సరిహద్దులో యుద్ధం చేసిన సైనికుడా? అని వ్యాఖ్యానించడంతో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలోనూ రేవంత్ దూకుడుగానే మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టుపై మొహమాటం లేకుండా స్పందించారు. ” ఒక సినీ నటుడు తన సినిమాను ఇంట్లో చూసుకోవచ్చు. లేకుంటే హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు. అంతేగాని అంతమంది జనం వచ్చినచోటకు కార్లో చేయి ఊపుతూ రావడం వల్ల జనం భారీగా వచ్చారు. ఆ సమయంలో వారందరినీ కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. అందువల్లే తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఓ భర్త తన భార్యను కోల్పోవాల్సి వచ్చింది. తన కుమారుడిని కాపాడుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతకంటే దారుణం ఏముంటుందని” రేవంత్ వ్యాఖ్యానించారు.

అందువల్లే దూకుడా?

రేవంత్ రెడ్డి కి సహజంగానే దూకుడు ఉంటుంది. ఆ దూకుడు వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాటి అధికార భారత రాష్ట్ర సమితిని ఎక్కడికక్కడ ఎండగట్టారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఆయనను కావాలని ఓడించినప్పటికీ.. మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో జవ సత్వాలు నింపారు. ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఏడాది పాటు తన పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన దూకుడు తగ్గించుకోవడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని విషయాలలోనూ సానుకూల ధోరణి కంటే మరింత దూకుడు తనాన్ని ప్రదర్శిస్తున్నారు . దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ.. రేవంత్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా సై అన్నట్టుగా పోటీకి సంకేతాలు ఇస్తున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ రేవంత్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా దూకుడు తత్వాన్ని కొనసాగించారు. రేవంత్ వ్యవహార శైలిని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా తప్పు పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగానే సమాధానం ఇస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య ఏకంగా యుద్ధమే జరుగుతున్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version