CM Jagan: సీఎం జగన్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. విపక్షాల అంచనాలకు అందని రీతిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు. జెట్ స్పీడులో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ధిక్కార స్వరాలకు గట్టి హెచ్చరికతో సంకేతాలు పంపుతున్నారు. నోరుజారితే వేటు తప్పదని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. విపక్షం టీడీపీ 23 స్థానాలు, జనసేనకు ఒకటంటే ఒకటే స్థానం విడిచిపెట్టింది. ఈసారి 175 స్థానాలకు 175 సాధించాలన్న కసితో సీఎం జగన్ ఉన్నారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముందుగా గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో నిలిచిన టీడీపీ కంచుకోటలపై దృష్టిసారించారు. అక్కడ బలమైన నాయకత్వాన్ని బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో పార్టీ ధిక్కార స్వరాలు ఉన్నచోట ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కి ఝలక్ ఇచ్చారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నేదురమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. హిందూపురం, గన్నవరం, పర్చూరు వంటి నియోజకవర్గాల విషయంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు.

గత ఎన్నికల్లో చీరాల, గన్నవరంలో టీడీపీ అభ్యర్థులుగా పోటీచేసిన కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్ లు గెలుపొందారు. వైసీపీ వైపు గోడదూకేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నేతలు ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ నిర్ధేశించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఎవరికి వారే చేస్తున్నారు. దీంతో కేడర్ లో అయోమయం నెలకొంది. రోజురోజుకూ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెంచారు. ముఖ్యంగా చీరాల పంచాయితీని కొలిక్క తెచ్చారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన అమాంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించి కరణం బలరాంకు లైన్ క్లీయర్ చేశారు. పర్చూరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీచేశారు. కానీ ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో జగన్ పర్చూరు నుంచి అమాంచి క్రిష్ణమోహన్ ను పోటీచేయించేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు.

అటు గన్నవరం నియోజకవర్గం విషయంలో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ వల్లభనేని వంశీమోహన్ ప్రకటించుకున్నారు. మరో ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరేనన్నట్టు పరిస్థితి ఉంది. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్న జగన్ ఒకటి రెండు రోజుల్లో సమీక్షిస్తారని తెలుస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో కూడా అధికార వైసీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇవి టీడీపీ సిట్టింగ్ స్థానాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి సంస్థాగతంగా బలం ఉంది. అందుకే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కానీ వైసీపీలో విభేదాలు సమసిపోలేదు. మంత్రి ఎదుటే వైసీపీ శ్రేణులు గొడవకు దిగారు. ఒకానొక దశలో మంత్రికే వైసీపీలోని ఓ వర్గం వారు చెప్పు చూపించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యం సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. సంక్రాంతిలోగా ఈ రెండు నియోజకవర్గాల విషయం తేల్చేయ్యాలని డిసైడయినట్టు సమాచారం.
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వరుస పరిణామాలు అధికార పార్టీకి కలవరపాటకు గురిచేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేలు పార్టీపై,
ప్రభుత్వవైఫల్యాలపై బాహటంగా విమర్శలు చేస్తున్ననేపథ్యంలో జగన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు, అయితే ఆనం రామనారాయణరెడ్డి విషయంలో ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయనకు ఇబ్బందిపెట్టే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మరో సమన్వయకర్తగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. తొలుత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై విమర్శలకే పరిమితమైనఆనం మరో పార్టీకి టచ్ లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. నేరుగా నాయకత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడడంతో ఆనంను తప్పించాలని భావిస్తున్నారు. అందుకే అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికైతే టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దించడంతో పాటు సొంత పార్టీలో ధిక్కార స్వరాలను చెక్ చెబుతూ జగన్ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.