Mike Tyson: ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన బాక్సింగ్ వీరుడు ‘మైక్ టైసన్’. అతడు రింగులోకి దిగాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా తన భీకర బాక్సింగ్ తో అభిమానులను సంపాదించుకున్న ఈ యోధుడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ‘లైగర్’ సినిమాలోనూ నటించి అందరినీ అలరించడానికి సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ ‘వీల్ చైర్’లో దర్శనమివ్వడం ఆయన అభిమానులను కలిచివేస్తోంది.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆరోగ్యంపై గత రెండు మూడురోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వీల్ చైర్ ఫొటో వైరల్ అయ్యింది. దీంతో మైక్ టైసన్ కు ఏమైందని అందరూ ఆరాతీస్తున్నారు. ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.
Also Read: Hero Rajasekhar: అప్పు పుట్టక కుమిలిపోతున్న స్టార్ హీరో.. మరోవైపు కేసు పెడతాను అంటున్న నిర్మాత
అయితే మైక్ టైసన్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టైసన్ కు కొన్ని రోజులుగా వెన్నునొప్పి బాధిస్తోంది. ఆయన ‘సయాటికా’ అనే నరాల జబ్బుతో బాధపడుతున్నారు. దీంతో నిలబడితే చాలు వెన్నులో నొప్పి వస్తోంది. దీంతో అతడికి వైద్యులు వీల్ చైర్ ను సూచించినట్టు తెలిసింది. ఎక్కువ సేపు నిలబడలేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా వీల్ చైర్ లోనే వెళుతున్నాడట.. ఇక నిలబడాల్సి వస్తే కర్ర సహాయంతోనే నిలబడగలుగుతున్నాడట.. ప్రస్తుతం మైక్ టైసన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రపంచాన్ని తన పంచులతో గడగడలాడించిన టైసన్ ను ఈ స్థితిలో చూసి ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. నాకు సమయం దగ్గరపడింది అని ఆయన ఇటీవల అన్న మాటలకు కూడా అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మైక్ టైసన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతూ మెసేజ్ లు చేస్తున్నారు.

