
Virat Kohli Jersey Number: క్రీడల్లో ప్రతీ ఆటగాడు ప్రత్యేక జెర్సీ నంబరుతో కన్పిస్తాడు. టీమిండియా మాజీ సారథి.. పరుగుల వీరుడు కోహ్లీ నంబరు 18. క్రికెట్ అభిమానులకు, కోహ్లీ వీరాభిమానులకు ఆయన పేరు వినగానే ‘జెర్సీ నంబరు 18’ కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా కోహ్లీ ఆ జెర్సీ నంబరులోనే కన్పిస్తాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కింగ్ తన సంఖ్యను మార్చుకోలేదు. దీని వెనుక ఓ కన్నీటి గాథ ఉంది. తన తండ్రి గుర్తుగా కోహ్లీ.. ‘నంబరు 18’ జెర్సీ మాత్రమే వేసుకుంటున్నాడు.
నాన్నపై ప్రేమతో..
కోహ్లీ 17 ఏళ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006, డిసెంబరు 18వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఢిల్లీ తరఫున కర్ణాటకతో కోహ్లీ ఓ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓ పక్క తండ్రి మరణించినా.. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కోహ్లీ.. ఆ రోజు మ్యాచ్ ఆడి ఏకంగా 90 పరుగులు చేశాడు. ఆ రోజు మ్యాచ్ ముగిశాక తండ్రి అంత్యక్రియలకు పాల్గొన్నాడు. తండ్రి మరణం తర్వాత మ్యాచ్ ఆడటంపై కోహ్లీ స్పందిస్తూ.. ఆ క్షణం తాను వ్యక్తిగా మారానని, కఠిన నిర్ణయం తీసుకున్నానని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. అందుకే తన తండ్రి మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18గా ఎంచుకున్నాడు.
అండర్ 19లో మారిన సంఖ్య..
ఇక అండర్ 19 జట్టులో చేరినప్పుడు తొలుత కోహ్లీకి జెర్సీ నంబరు 44 కేటాయించారట. అయితే కొన్నాళ్లకు అతడు జెర్సీ నంబరు 18కి మారాడు. అదే నంబరుతో అండర్ 19 జట్టుకు సారథిగా భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ టీమిండియా జట్టులో చేరేనాటికి అదృష్టవశాత్తూ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా విరాట్‌కు ఆ నంబరు దక్కింది. ఇక నాటి నుంచి కోహ్లీ అదే నంబరుతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

జర్సీ నంబర్ 18కు మరో ప్రత్యేకత కూడా ఉందట. కోహ్లీ తండ్రి ప్రేమ్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో జెర్సీ నంబరు 18 వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా ఇప్పటికీ అదే నంబరుతో కన్పిస్తున్నాడు.