
Fire On BRS Atmiya Sammelanam: భారత రాష్ట్ర సమితి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచానే పేల్చారు. అయితే బాణ సంచా నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న గుడిసెపై పడడంతో అందులో ఉన్న సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఫైర్ ఇంజన్ అధికారులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాగంగా ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కారేపల్లి మండలంలోని చీమలపాడులో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలు భావించారు. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యేలు సమ్మేళనం నిర్వహించే ప్రదేశానికి రాగానే వారిలో ఉత్సాహం నెలకొంది. దీంతో బాణసంచాను పేల్చి సందడి చేశారు.
అయితే బాణ సంచాకు సంబంధించిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెలపై పడ్డాయి. ఈ గుడిసెలు అంటుకోవడంతో అగ్గి రవ్వలు అందులో ఉన్న సిలిండర్ పై పడ్డాయి. దీంతో అది ఒక్కసారిగా శబ్దం చేసి పేలిపోయింది. ఈ పేలుడు దాటికి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసుల వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కలత చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

చీమలపాడు ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఇద్దరు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబానికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. అనంతరం ఎంపీ నామానాగేశ్వర్ రావుమాట్లాడుతూ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి, పేలుడు ఘటనకు సంబంధం లేదని అన్నారు. 200 మీటర్ల దూరంలో ఒక సిలిండర్ పేలిందని ఆయన అన్నారు.