
Bandi Sanjay Arrest: తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ రచ్చ కొనసాగుతూనే ఉంది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ మొదటిరోజు తెలుగు పేపర్ లీక్ కాగా, రెండో రోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ పరీక్ష సమయంలో బయటకు రావడం.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసేదాకా వెళ్లింది. పరీక్ష పత్రాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మాజీ రిపోర్టర్ ప్రశాంత్ బీజేపీకి అనుకూలంగా పని చేసే వ్యక్తి అని, బండి సంజయ్‌కి ఫోన్ చేశాడని, మొత్తం ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో పెట్టిన తర్వాత ప్రశాంత్ తన ఫోన్ నుంచి 145 ఫోన్ కాల్స్ చేశారని పోలీసులు వెల్లడించారు. పరీక్ష పత్రం లీక్ వెనుక బీజేపీ హస్తముందని భావించి ప్రశాంత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ నేతల ఆగ్రహం..
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన, బండి సంజయ్‌తో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన ప్రశ్నాపత్రం లీకేజ్‌కు బండి సంజయ్‌కు ఏం సంబంధం అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ బీఆర్‌ఎస్ నేతలతో కూడా ఫొటోలు దిగాడని, వారందరినీ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కొనసాగుతున్న రచ్చ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్‌ని విడుదల చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తుంటే, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

వరంగల్‌కు ‘బండి’
నిన్న అర్ధరాత్రి బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న బండి సంజయ్‌ను మొదట భువనగిరిలో ఉన్న కోర్టులో హాజరు పరుస్తారని భావించినప్పటికీ బండి సంజయ్ వాహనాన్ని హనుమకొండ వైపుకు వళ్లించారు.
కాన్వాయ్ మారుస్తూ.. దొడ్డి దారిలో..
ఆలేరు సమీపంలో బండి సంజయ్‌ను తీసుకు వెళుతున్న పోలీసులను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ వెళ్లే వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన పోలీసులు కాన్వాయ్ మారుస్తూ, రూట్ మారుస్తూ వరంగల్‌కు తీసుకెళ్లారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ నాయకులు బయటకు రాకుండా హౌస్ అరెస్టులు, అరెస్టులు చేస్తున్న పోలీసులు బండి సంజయ్‌ను వరంగల్‌కు తీసుకెళ్లారు. పాలకుర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వరంగల్లో బండి సంజయ్‌పై కేసు నమోదు అయిన కారణంగా వరంగల్ కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోర్టు వద్ద భద్రత పెంపు..
బండి సంజయ్‌ను కోర్టులో హాజరు పరిచే క్రమంలో బీజేపీ నాయకులు అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు వరంగల్ కోర్టు వద్ద కూడా భద్రత పెంచారు. కోర్టుకు వచ్చిన బీజేపీ నాయకులను చెదరగొట్టారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.