
Chandrababu Focus On Uttarandhra: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత జోరు మీద ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అదే ఉత్సాహంతో ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లా నేతలతో ప్రాంతీయ సదస్సును విశాఖ నగరంలో నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున క్యాడర్ ను సమాయత్తం చేసే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు వేదికగా ఉత్తరాంధ్ర సమస్యల పైన చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరాంధ్రలో బలంగానే తెలుగుదేశం పార్టీ..
గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాల ఉండగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన బెందాళం అశోక్, టెక్కలి నుంచి విజయం సాధించిన రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు, అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి నగర పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు విజయం సాధించారు. వీరిలో దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసిపి గూటికి చేరిపోగా.. మొన్నటివరకు సైలెంట్ గా ఉండిపోయిన ఘంటా శ్రీనివాసరావు ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఉత్తరాంధ్ర ప్రాంతి సదస్సులు నిర్వహిస్తుండడంతో పార్టీ శ్రేణులకు ఆయన ఏం దిశా నిర్దేశం చేస్తారని ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్సీ విజయంతో ఉత్సాహంలో కేడర్..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవి విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గడచిన నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ ప్రాంతంలో స్తబ్దుగా ఉండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత ఒక్కసారిగా క్యాడర్లో ఉత్సాహం ఊపందుకుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు పార్టీ నాయకులతో పాటు క్యాడర్ ను సమయత్త పరిచే అవకాశం ఉంది.
విభేదాలు కొలిక్కి వచ్చేనా..
ఇప్పుడిప్పుడే విజయాలతో ఉత్సాహంగా కనిపిస్తున్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. మొన్నటి వరకు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటంతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పార్టీలో యాక్టివ్ గా కనిపించారు. అయితే గంట మళ్లీ పార్టీకి దగ్గర అవడంతో ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు రోజుల కిందట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశానికి అయ్యన్నపాత్రుడు గైర్హాజరయ్యారు. పార్టీలోని విభేదాలను ఈ సభా వేదికగా చంద్రబాబు పరిష్కరించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పార్టీ ముఖ్య నేతలకు లక్ష్యాలను విధించే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల నమోదు, సాధికార సారధి నియామక ప్రక్రియ, వైసీపీ మోసం చేస్తున్న సంక్షేమ పథకాలు తీరు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఆయా నియోజకవర్గం స్పష్టతనిచ్చేనా..
ఉత్తరాంధ్ర పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలపై నాయకులు ఆశలు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ సదస్సులో ఆయా నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై స్పష్టతను ఇచ్చే అవకాశం ఉందా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇప్పటికి స్పష్టత ఇవ్వకపోతే ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్తితి ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.