CM Jagan: వైసీపీలో క్రమశిక్షణ ఎక్కువ అంటారు. అధినేత జగన్ మాటే శిరోధార్యంగా భావిస్తారు. ఆయన మాటే ఫైనల్.. కాదు కాదు శాసనమని కూడా చెబుతారు. ఆయన అంటే ఎమ్మెల్యేలకు భయమని.. ఎదురుతిరిగి మాట్లాడరని కూడా వైసీపీలో ప్రచారం ఉంది. కానీ అదంత ఉత్తమాటేనని తేలిపోయింది. జగన్ కు ఎమ్మెల్యేలు భయపడడమేమిటి? జగనే ఎమ్మెల్యేలకు భయపడినట్టుంది ఇప్పుడు పరిస్థితి. ప్రభుత్వ విధానాలపై, వైఫల్యాలపై ఎమ్మెల్యేలు బాహటంగా మాట్లాడుతున్నా స్పందించలేని స్థితిలో జగన్ ఉన్నారు. మరీ అభ్యంతరకర వ్యాఖ్యలుంటే జగన్ కు కట్టబానిస, కట్టప్పలుగా భావించే ఆ నలుగురితో మాట్లాడిస్తారు. లేదంటే తెలిసి తెలియని భాషలో, వంకర టింకరగా మాట్లాడే బొత్సతో కొన్ని మాటలు అనిపిస్తారు. కౌంటర్ ఇప్పిస్తారు. కానీ ఎమ్మెల్యేలు వీటిని లెక్కచేయడం లేదు. ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడే ఆ నలుగురికి ఏం తెలుస్తుంది. ప్రజల మధ్యకు రండి అని సవాల్ చేస్తున్నారు. ఇలా స్వరం పెంచే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి కొద్ది మందే అయినా.. వారి జాబితా చాంతాడంత ఉందని తెలియడం ఇప్పుడు అధికార వైసీపీలో కాక రేపుతోంది.

గతంలో పార్టీ, ప్రభుత్వం, అధినేత గురించి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ ఆగ్రహానికి గురికాక తప్పదన్న హెచ్చరికలుండేవి. చర్యలు తప్పవని హెచ్చరించారు. కాదు అలా ప్రచారం చేసేవారు. ఎవరికీ హెచ్చరించిన దాఖలాలు లేవు. కనీస చర్యలు తీసుకోలేదు కూడా. ఒకరిద్దరు మాజీలకు, కింది స్థాయి నాయకుల విషయంలో జరుగుండొచ్చు కానీ.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులపై చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. అయితే ఒకవైపు పార్టీని ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. రోజుకొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయినా జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపించదు. అటు సాక్షి మీడియా కూడా వారి దాని గురించి ప్రస్తావించడం లేదు. అంటే జగన్ భయపడుతున్నట్టే కదా. గతం కంటే కాస్తా వెనుకడుగు వేసినట్టే కదా.
రాష్ట్రంలో పింఛన్లు తొలగించడం లేదని.. అదంతా విపక్షాల ప్రచారం అని.. గిట్టని మీడియా వారు చేస్తున్న పనిగా జగన్ కొట్టి పారేశారు. ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే పింఛన్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అవమానించారు. అయినా కోటంరెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. ఆనం రామనారాయణరెడ్డి అయితే మరీ ఘోరంగా మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలనే ఎత్తిచూపారు. ఎలా ప్రజల ముందుకు వెళ్లాలని ప్రశ్నించారు. విపక్ష ఎమ్మెల్యే కంటే దారుణంగా మాట్లాడారు. కానీ ఆయనపై కోపం ప్రదర్శించలేదు. అసహనం చూపలేదు. బొత్సలాంటి నాయకులు ఇండైరెక్ట్ గా మాట్లాడారు. జగన్ రెక్కల కష్టంతో వచ్చి ప్రభుత్వమని మాత్రమే చెప్పారు. ఆనం నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పలేకపోయారు. ఎన్నికల వేళ వారిని కెలికితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని తెలిసి.. ఇన్నాళ్లూ తన భయం ఉన్నట్టు ప్రచారం చేసుకున్న జగన్.. కాస్తా తగ్గి తాను భయపడుతున్నట్టు నటిస్తున్నారు. ఎన్నికల్లో వారి సంగతి చూసుకోవచ్చు కదా అని సర్దుబాటు చేసుకుంటున్నారు.

ఒక్క ఆనం, కోటంరెడ్డే కాదు.. వైసీపీలో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా నాలుగేళ్లు పేరుకే పదవులు అనుభవించారు. సంపాదనంతా ఆ కొద్దిమంది, ఆ సామాజికవర్గం వారే అనుభవించారన్న బాధ మిగతా ఎమ్మెల్యేల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో తాను అన్నివిధాలా మీకు అండగా ఉంటానని అధినేత హామీ ఇచ్చినా.. ముందస్తు హామీ మేరకు ఎక్కడ తమ ఆస్తులను రాయించుకుంటారేమోనని అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితిని చూసిన వారు అదే అనుమానంతో ఉన్నారు. ఆ అనుమానం, అసంతృప్తి,, ఆవేదన.. ఇలా అన్ని కలగలిపే ప్రభుత్వంపై, అధినేత తీరుపై వారు మాట్లాడుతున్నారు. కానీ జగన్ మాత్రం వారికి కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా సాహసించడం లేదు. కంట్రోల్ కట్టుదాటుతుందన్న బెంగతోనే సైలెంటే ఉత్తమమని భావిస్తున్నారు.