
MLC Kavitha- KCR: ఢిల్లీ మద్యం కుంభకోణంలో రోజుకో సంచలనం నమోదవుతుంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక వ్యక్తులను ఈడీ అరెస్టు చేస్తోంది. అంతే కాదు కోర్టులో వరుస ఛార్జ్ షీట్లు నమోదు చేస్తోంది. విచారణ లో వెలుగు చూసిన విషయాలను మీడియాకి లీక్ చేస్తోంది. అంతే కాదు కీలక విషయాలను కూడా బయట పెడుతోంది. ఇక ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఈసారి ఎమ్మెల్సీ కవిత వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
సరయిన సమయంలో విచారించాలని..
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను కూడా సరైన సమయంలో విచారించాలని నిర్ణయించిన దర్యాప్తు సంస్థ.. గురువారం విచారణకు రావాలంటూ అత్యవసరంగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారు ఇచ్చిన స్టేట్‌మెంట్, రిమాండ్ రిపోర్టులు, సీబీఐ సేకరించిన ఆధారాల మేరకు ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. పక్కా ఆధారాల మేరకు కవితను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. కవిత బినామీగా పేర్కొన్న పిళ్లైని ఇప్పటికే పలుమార్లు విచారించి, వీలైనంత సమాచారం రాబట్టింది. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో పిళ్లై, కవిత ఇద్దరు చెప్పేది సరిపోలకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సిందే. గత డిసెంబరులో ప్రాథమిక విచారణలో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి మరీ కవితను ప్రశ్నించారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
ఈడీ జోరు పెంచింది
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా అరెస్ట్ కావడం, సోదాలు, ఆధారాల సేకరణ నేపథ్యంలో ఈడీ జోరు పెంచింది. మనీలాండరింగ్ కోణం కాబట్టి కవిత సీబీఐకి ఇచ్చిన బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. వాటి ఆధారంగా ఆమెను ప్రశ్నించనున్నారు.
ఆ రోజు విచారణకు వెళ్తే ఇబ్బంది తప్పదా?
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు ఇద్దరూ ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితులు. పిళ్లై కవిత బినామీ అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఈడీ అధికారుల అదుపులోనే ఉన్నారు. ఇక ఆడిటర్ బుచ్చిబాబు నుంచి కూడా కీలక సమాచారం రాబట్టారు. పిళ్లై, బుచ్చిబాబును కలిపి విచారించే సమయంలోనే కవితనూ ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు పంపారు. అయితే ఈ సమయంలో కవిత విచారణకు హాజరవడం వల్ల దర్యాప్తు సంస్థలకు మరింత మేలు చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. అయితే కవితకు మాత్రం ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు సలహా ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నెల 13న కవిత పుట్టిన రోజు
ఈ నెల 13న కవిత పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పిళ్లై వారం రోజుల కస్టడీ ముగిసిన తర్వాతే ఆమె విచారణకు హాజరయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు చర్చ జరిగింది. కానీ, తాను ఈ నెల 11నే విచారణకు హాజరవుతానని బుధవారం రాత్రి కవిత ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. కాగా, కవితకు న్యాయ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ రంగంలోకి దిగింది. గత డిసెంబరులో సీబీఐ నోటీసులు అందిన సమయంలోనూ తండ్రి, న్యాయ నిపుణుల సూచన మేరకు విచారణకు గడువు తీసుకున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులపైనా న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. కవిత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్, న్యాయనిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పేరు మోసిన లాయర్ల తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.