Electric Scooter Burnt: వైరల్ వీడియో: అలా పార్క్ చేశాడు.. ఇలా పొగలు కక్కుకుంటూ కాలిపోయింది

అది విశాలమైన రోడ్డు. రాత్రి కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఒక డివైడర్ పక్కన ఒక ఎలక్ట్రిక్ వాహనం పార్క్ చేసి ఉంది. ఈ క్రమంలోనే ఆ వాహనం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది.

Written By: K.R, Updated On : August 28, 2023 4:43 pm

Electric Scooter Burnt

Follow us on

Electric Scooter Burnt: రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల వాడకం అంతకుమించి అనే లాగా ఉంది. ఈ క్రమంలో చమురు వాడకం కూడా తారాస్థాయికి చేరుతోంది. చమురు శిలాజ ఇంధనం కాబట్టి వాడకం ఇదే స్థాయిలో ఉంటే.. దాని నిల్వలు త్వరలోనే అడుగంటి పోతాయి. అప్పుడు మనుషుల అవసరాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితిని ముందే ఊహించి శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ వాహనాలు కనుగొన్నారు. వీటికి ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలు ఉంటాయి కాబట్టి.. చార్జింగ్ చేస్తే వాహనం రయ్యమంటూ పరుగులు తీస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అధికంగా ఉంటుంది. టెస్లా అనే కంపెనీ ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తూ ఉంటుంది. బొమ్మ వెనుక బొరుసు ఉన్నట్టు.. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ వాహనం వెనుక కూడా అనేక అనర్ధాలు ఉన్నాయని ఒక సంఘటన నిరూపించింది.

వెంటనే కాలిపోయింది

అది విశాలమైన రోడ్డు. రాత్రి కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఒక డివైడర్ పక్కన ఒక ఎలక్ట్రిక్ వాహనం పార్క్ చేసి ఉంది. ఈ క్రమంలోనే ఆ వాహనం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఆ పొగలు ఆ ప్రాంతాన్ని దట్టంగా అలముకున్నాయి. ఆ పొగలు కాస్త తగ్గిపోయి మంటలు ప్రారంభమయ్యాయి. అలా మంటలు పెరిగి అందులోనే ఆ వాహనం పూర్తిగా కాలిపోయింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోతుంటాయి. బయటి వాతావరణం లో వేడి ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ రాత్రి సమయంలో, అది కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న సందర్భంలో ఎలక్ట్రిక్ వాహనం కాలిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మిలియన్ వ్యూస్

కాగా ఈ ఎలక్ట్రిక్ వాహనం కాలిపోయిన దృష్యాలను వీడియో తీసిన ఒక వ్యక్తి “ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్” అనే ఇన్ స్టా గ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. దెబ్బకు ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఇప్పటివరకు మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది.. రకరకాలుగా స్పందిస్తున్నారు. “వామ్మో చూస్తుండగానే కాలిపోయింది” అని కొందరు వ్యాఖ్యానించారు. ” ఈవీ లను పర్యావరణ అనుకూల వాహనాలు అని ఎందుకంటారు” అని మరికొందరు ప్రశ్నించారు. ” ఎలక్ట్రిక్ వాహనాలలో లిథియం వాడుతుంటారు. ఇలా వాహనాలు కాలిపోయినప్పుడు అది పర్యావరణానికి ఎక్కువ హాని కలుగజేస్తుంది” అని మరికొందరు రాసుకొచ్చారు. కాకపోతే ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడ జరిగిందో పేర్కొనకపోవడం విశేషం.