YCP: కొత్త ప్రయోగానికి వైసీపీ సిద్ధం.. వారందరికీ టిక్కెట్లు లేనట్టే

వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున 22 మంది ఎంపీలు గెలుపొందారు. తామంతా ఉత్సవ విగ్రహాలుగా మారామన్న ఆవేదన వారిలో ఉంది. చాలామంది ఎంపీలకు స్థానిక ఎమ్మెల్యేల తో విభేదాలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : August 28, 2023 4:48 pm

YCP

Follow us on

YCP: వచ్చే ఎన్నికల్లో వైసిపి కొత్త ప్రయోగానికి తెర తీయనుంది. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా… ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయిస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని ఐపాక్ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో ప్రత్యామ్నాయ నాయకులను తీసుకొచ్చేందుకు హై కమాండ్ సిద్దపడుతోంది. అయితే కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటి వారిని పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల స్థానంలో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున 22 మంది ఎంపీలు గెలుపొందారు. తామంతా ఉత్సవ విగ్రహాలుగా మారామన్న ఆవేదన వారిలో ఉంది. చాలామంది ఎంపీలకు స్థానిక ఎమ్మెల్యేల తో విభేదాలు ఉన్నాయి. మరోవైపు చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు ఉన్నాయి. స్థానికంగా కూడా వ్యతిరేకత ఉంది. క్యాడర్ తో సైతం పొసగని పరిస్థితి. అటువంటి స్థానాల్లో అభ్యర్థి మార్పు అనివార్యం.

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా మంత్రిపై వ్యతిరేకత ఉండడంతో పాటు.. లోకల్ క్యాడర్ సైతం ఆయన్ను విభేదిస్తోంది. అటు ఐపాక్ నివేదికలో సైతం వెనుకబడినట్లు సమాచారం. అటు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని సైతం అనకాపల్లి ఎంపీగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఆయన సైతం వెనుకబడిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు చోడవరం నియోజకవర్గంలో టిడిపి,జనసేన గ్రాఫ్ పెరిగిందని హై కమాండ్ కు నివేదికలు అందాయి. అక్కడ కొత్త అభ్యర్థి అయితేనే గట్టెక్కగలరని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పంపించాలని జగన్ యోచిస్తున్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు స్థానాలు కాకుండా.. దాదాపు 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.