Homeజాతీయ వార్తలుInterim Relief Allowance: బంగారు తెలంగాణలో.. మధ్యంతర భృతికీ దిక్కు లేదా?

Interim Relief Allowance: బంగారు తెలంగాణలో.. మధ్యంతర భృతికీ దిక్కు లేదా?

Interim Relief Allowance: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర భృతి(ఐఆర్‌)పై సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల షెడ్యూలు కంటే ముందే ఐఆర్‌ను ప్రకటిస్తే బాగుంటుందని, లేకపోతే పూర్తిగా పెండింగ్‌లో పడిపోయే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు ప్రభుత్వం నుంచి మూడు డీఏలు రావాల్సి ఉందని, ఇప్పుడు ఐఆర్‌ కూడా లేకపోతే ఎలా అని వాపోతున్నారు. రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఇప్పటివరకు ఏర్పడకపోవడం, కనీసం ఐఆర్‌పైనా నిర్ణయం వెలువడకపోవడం ఉద్యోగులను, పెన్షనర్లను కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మొదటి వేతన సవరణ సంఘం(పీఆర్సీ) కాలం జూన్‌ 30తో ముగిసింది. జూలై 1 నుంచి రెండో పీఆర్సీ వేతనాలు అందాల్సి ఉంది. కానీ, ఆగస్టు నెల గడిచిపోతున్నా ప్రభుత్వం ఇంకా పీఆర్సీని ఏర్పాటు చేయలేదు.

అసెంబ్లీ సమావేశాల్లో …

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ పీఆర్సీ, ఐఆర్‌ గురించి ప్రస్తావించారు. పీఆర్సీని ఏర్పాటు చేస్తామని, వేతనాలను పెంచుతామని ప్రకటించారు. పీఆర్సీకి ముందే ఐఆర్‌ను ఇస్తామని చెప్పారు. కానీ, ఇప్పటివరకు పీఆర్సీని ఏర్పాటు చేయలేదు. పీఆర్సీ జాప్యం నేపథ్యంలో కనీసం ఐఆర్‌ను ప్రకటిస్తే బాగుంటుందని ఉద్యోగులు, పెన్షనర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జూలై, ఆగస్టు నెలలు గడిచిపోయాయని, కొత్తగా ప్రకటించే ఐఆర్‌ జూలై నెల నుంచి(రెట్రోస్పెక్టివ్‌) అమల్లోకి వస్తుందా లేక ప్రకటించిన నెల నుంచి(ప్రాస్పెక్టివ్‌) అమల్లోకి వస్తుందా అన్న సందేహాలను కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ విషయంలో గతంలో ఇలాగే మోసపోయామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 21 నెలల ఫిట్‌మెంట్‌ కాగితాలకే పరిమితమైందని గుర్తుచేశారు. అందుకే ఐఆర్‌ను జూలై 1 నుంచి అమలయ్యేలా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఐఆర్‌పై ఆర్థికశాఖ కసరత్తు?

ఎంత ఐఆర్‌ ప్రకటిస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందో ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. దీనిపై నివేదిక పంపితే.. సీఎం పరిశీలించి ప్రకటన చేస్తారని చెబుతున్నారు. సెప్టెంబరులో ప్రకటన ఉండొచ్చని కొంత మంది ఉద్యోగ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఐఆర్‌ ను ప్రకటిస్తే అది ఎంత ఉంటుందన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు 30ు వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుండగా.. మరికొన్ని 22 శాతం ఇవ్వాలని కోరుతున్నాయి. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఎప్పటికప్పుడు వీటిని ప్రకటిస్తే జీతాలు పెరిగేవని ఉద్యోగులు చెప్తున్నారు. కనీసం ఐఆర్‌ పరంగానైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. 10 శాతం కంటే ఎక్కువ ఐఆర్‌ను ప్రకటిస్తే గొప్పేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version