Andhra Jyothi: అప్పట్లో ఈనాడులో కుక్క మూతి పిందెలు తన శీర్షికతో ఓ వార్త కథనం ప్రచురితమైంది. అప్పట్లో అది పెను సంచలనానికి కారణమైంది.. ఈనాడు మీదికి నాడు అధికారంలో ఉన్న నాయకులు యుద్ధానికి దిగారు. చివరికి అది కోర్టు దాకా వెళ్ళింది. అంటే ఒక శీర్షిక అంతటి సంచలనానికి కారణమైంది. అందుకే ఒక వార్తకు శీర్షికను శిరస్సు అంటారు..” పాత్రికేయులు వాగాడంబరంతో గొప్పవాళ్ళం అయ్యామని అనుకోవద్దు. వాక్యాడంబరంతో విశిష్టంగా పేరు తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా రాస్తున్న వార్తలకు.. చదువ సొంపైన శీర్షికను పెట్టాలి. అప్పుడే పాఠకులకు చదవాలి అనిపిస్తుంది. ఒక పాఠకుడు వార్తను చదువుకుండా వదిలేశాడు అంటే.. శీర్షిక లోపం కాదు.. శీర్షిక పెట్టలేని ఉపసంపాదకుడిది.. విలేకరిది కూడా. అందుకే వార్తను చదివించగలిగే స్థాయిలో.. చదవాలనే స్థాయిలో.. శీర్షికను పెట్టాలి. అప్పుడే రాసిన విలేఖరికి.. వార్తను తీర్చిదిద్దిన ఉపసంపాదకుడికి విలువ ఉంటుంది. పాత్రికేయమంటే విలువలు మాత్రమే కాదు..చదవాలనిపించే రచన కూడా. అది చేయలేని నాడు పాత్రికేయులు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం ఉత్తమం” ఈ మాట అన్నది సుప్రసిద్ధ పాత్రికేయులు, ఈనాడు జర్నలిజం కాలేజీకి సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్ గా పని చేసిన బూదరాజు రాధాకృష్ణ.. నాడే కాదు, నేటి రోజుల్లో బూదరాజు రాధాకృష్ణ రాసిన పుస్తకాలు పాత్రికేయులకు అమూక్త మాల్యద లాంటివి.
Also Read: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. విడుదల తేదీ ప్రకటించిన బోర్డు.. ఎప్పుడంటే?
ఎవరు పాటిస్తున్నారు
పాత్రికేయం గురించి.. పాత్రికేయ విలువల గురించి గజ్జల మల్లారెడ్డి, శ్రీశ్రీ, నండూరి రామ్మోహన్రావు, బూదరాజు రాధాకృష్ణ వంటి వారు గొప్పగా చెప్పారు. గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. కానీ నేటి రోజుల్లో వాటిని ఎవరు పాటిస్తున్నారు. అసలు అలాంటి పుస్తకాలను ఎవరు చదువుతున్నారు.. సోషల్ మీడియా కాలం సాగుతున్న నేటి రోజుల్లో అన్ని ఇన్స్టెంట్ గానే మారిపోయాయి. చివరికి రాసే రాతలు.. పెట్టే శీర్షికలు కూడా అర్థరహితంగా ఉంటున్నాయి. తెలుగు నాట దమ్మున్న పత్రికగా చెప్పుకుంటున్న ఆంధ్రజ్యోతిలో సోమవారం నాటి ఎడిషన్లో “యూత్ అంకుల్స్.. యంగ్ ఆంటీస్” అని ఓ శీర్షికతో కథనం ప్రచురితమైంది. వాస్తవానికి ఇలాంటి స్టోరీలు రాయాలి అనుకున్నప్పుడు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నప్పుడు.. దానికంటూ హృద్యంగా ఒక శీర్షిక ఉండాలి.. ఐదు పదుల వయసుకు వచ్చిన సరే చాలామందికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నారు. ఎరుకతో ఆహారాన్ని తింటున్నారు.. అందువల్లే ఐదు పదుల వయసుకు వచ్చినా సరే యువత లాగే ఉంటున్నారు. అయినప్పటికీ ” యంగ్ ఆంటీస్, యూత్ అంకుల్స్” అని శీర్షిక పెట్టడం ఏంటో.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకే తెలియాలి. అలాంటప్పుడు దమ్మున్న పత్రిక అని ఉపశీర్షిక పెట్టుకోవడం ఎందుకో.. రాధాకృష్ణకు అవగతం కావాలి. ఇలాంటి రాతలు రాసి.. ఇలాంటి శీర్షికలు పెట్టి.. కార్ రేస్.. బైక్ రేస్…అంటూ ఎన్ని రకాల పోటీలు పెట్టినా పత్రిక సర్కులేషన్ పెరగదు. అది మొదటి స్థానానికి చేరుకోదు. చదువుతుంటే కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఇది నిష్ఠూర సత్యం. ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడే భాషలో అనివార్యం అయిపోయింది. కాకపోతే కాసింత ఆ తెలుగును కూడా తెలుగు పత్రికలు బతికించకపోతే.. తెలుగు ఏ మాత్రం వర్ధిల్లుతుంది.. ఏమాత్రం మనుగడ సాధించగలుగుతుంది. “బాడుగనేతలు” , ” పెద్దలా భూ గద్దలా” “భూం” చేస్తున్నారు, రాజావారి “భూ” మ్మర్ది.. అని శీర్షికలు పెట్టి.. విస్ఫోటనకర వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి.. నిజంగా ఇలాంటి శీర్షికలు పెట్టడం అంటే పడిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. అన్నట్టు ఈ స్థాయిలో వార్తలు ప్రస్తుతమవుతున్నప్పటికీ.. రాధాకృష్ణ పట్టించుకోవడం లేదా.. లేదా నిన్న ఆదివారం కాబట్టి డెస్క్ పెద్దలు లీవ్ లో ఉన్నారా.. సిటీ టాబ్లాయిడ్ ఫస్ట్ పేజీ వార్తను మెయిన్ ఎడిషన్ సెకండ్ బ్యానర్ వేశారంటే.. సెంట్రల్ డెస్క్ లో పరిస్థితి ఎలా ఉందో ఆ మాత్రం అర్థం చేసుకోలేమా?!
Also Read: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజులు వైన్ షాపుల బంద్!