Andhra Jyothi Editor Post: ఎడిటర్ పోస్ట్ : వక్కలంక రమణ కాకుండా.. రాహుల్ వైపు రాధాకృష్ణ ఎందుకు మొగ్గినట్టు?!

ఆంధ్రజ్యోతిలో ఏం జరిగినా సంచలనమే.. చివరికి ఎడిటర్ మార్పు కూడా.. సుదీర్ఘకాలం ఎడిటర్ గా పనిచేస్తున్న కే శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. దీని వెనుక ఏం కారణాలు ఉన్నాయి? ఉన్నట్టుండి ఆయన ఎందుకు రాజీనామా చేశారు? ఇన్ని రోజులపాటు సర్వీస్ ఎక్స్ టెన్షన్లో ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నలను కాస్త పక్కన పెడితే కొత్త ఎడిటర్ గా రాహుల్ కుమార్ నియామకం జర్నలిజం వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Written By: Velishala Suresh, Updated On : October 19, 2024 4:11 pm

Andhra Jyothi Editor Post

Follow us on

Andhra Jyothi Editor Post: ఆంధ్రజ్యోతిలో శ్రీనివాస్ ఎలాగైతే వివాద రహితుడో.. క్వాలిటీ సెల్ ఇన్చార్జిగా, సెంట్రల్ డెస్క్ పర్యవేక్షకుడిగా వక్కలంక రమణ కూడా సీనియరే. జర్నలిజం స్కూల్లో ట్రాన్స్లేషన్ వంటి క్లాసులు కూడా చెబుతాడు. వర్తమాన అంశాల మీద.. ఇతర విషయాల మీద వక్కలంక రమణకు అపారమైన పట్టు ఉంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలను అద్భుతంగా రాయగలడు. ఇటీవలి ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంలో తెర వెనుక విషయాలను అద్భుతంగా ప్రజెంటేషన్ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. పైగా ఇటీవల వేమూరి రాధాకృష్ణతో కలిసి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నాడు. దీంతో అతడే కాబోయే ఈ ఎడిటర్ అని చర్చ మొదలైంది. ఆయన వ్యవహరించిన తీరు కూడా దానికి బలాన్ని ఇచ్చింది. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కాని రమణను కాదని రాధాకృష్ణ రాహుల్ కుమార్ వైపు మొగ్గు చూపాడు.

రాహుల్ కుమార్ ఈనాడు లో సుదీర్ఘకాలం పనిచేశారు. అసిస్టెంట్ ఎడిటర్ గా కొనసాగారు. ఆయనకు వర్తమాన అంశాల మీద పట్టు ఉంది. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం రాహుల్ కుమార్ ఈనాడు నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో చేరిపోయారు. అంతకుముందు ఆంధ్రజ్యోతిలో సెంట్రల్ డెస్క్ లో పనిచేసిన తిగుళ్ల కృష్ణమూర్తి నమస్తే తెలంగాణకు ఎడిటర్ గా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన నాటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. రాహుల్ వచ్చేవరకు ఆ స్థానాన్ని వక్క లంక రమణ పర్యవేక్షించారు. ఓ వైపు క్వాలిటీ సెల్ వ్యవహారాలు చూసుకుంటూనే.. సెంట్రల్ డెస్క్ ను కూడా నడిపించేవారు. అయితే రాహుల్ కుమార్ ఎంట్రీ తో ఒకసారి గా సీన్ మారింది..

ఆ తర్వాత సెంట్రల్ డెస్క్ లో రమణ జోక్యం తగ్గింది. అయితే ఇటీవల రాధాకృష్ణ జిల్లాల పర్యటనలో వక్కలంక రమణ ప్రధానంగా కనిపించారు. అయితే ఆయనే తదుపరి ఎడిటర్ అని ప్రచారం జరిగింది. కాని చివరికి రాధాకృష్ణ రాహుల్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రాహుల్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్, బాగా రాగలడు, సెంట్రల్ డెస్క్ ను పకడ్బందీగా నడిపించగలడు. అందువల్లే రాధాకృష్ణ రమణను కాదని రాహుల్ వైపు ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. అయితే దీని వెనుక రకరకాల కారణాలు ఉన్నాయని.. అందువల్లే రాహుల్ ను ఎడిటర్ గా రాధాకృష్ణ నియమించాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమయంలో రమణ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఆయన తన తదుపరి అడుగులు ఎటువైపు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వివాద రహితుడు.. పని రాక్షసుడు కాబట్టే రాహుల్ వైపు రాధాకృష్ణ మొగ్గు చూపించారని.. తెలుస్తోంది. అయితే ఈనాడు ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ఇద్దరు ఎడిటర్లను నియమించింది. అటు సాక్షి, ఇటు ఆంధ్రజ్యోతి మాత్రం ఒక్క ఎడిటర్ తోనే పని కొనసాగిస్తోంది. సాక్షి ఏపీ సెంట్రల్ డెస్క్ కూడా హైదరాబాదులోనే ఉంది. అయితే ఆంధ్రజ్యోతి మాత్రం విజయవాడ నుంచి ఏపీ సెంట్రల్ డెస్క్ కొనసాగిస్తోంది.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గతంలో శ్రీనివాస్ మాదిరే.. రాహుల్ కూడా రెండు రాష్ట్రాలకు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా కొనసాగుతారని సమాచారం.