Nara Lokesh: సాక్షిపై లోకేష్ గురి.. పరువు, పరిహారం దక్కించుకుంటారా?

తమకు అనుకూల మీడియా ఉండాలని రాజశేఖర్ రెడ్డి భావించారు. తన కుమారుడితో సాక్షి మీడియాను ఏర్పాటు చేయించారు. అయితే నిత్యం ప్రత్యర్థులపై బురదజల్లే కథనాలు ప్రచురిస్తూ వస్తోంది సాక్షి. ఈ క్రమంలో టిడిపి యువనేత నారా లోకేష్ పై ఒక కథనం ప్రచురించింది. దీనిపై లోకేష్ న్యాయపోరాటం ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : October 19, 2024 4:04 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఏపీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో వైసిపి పాలనలో విధ్వంసకర పరిస్థితులు నడిచాయి. టిడిపి, జనసేన నేతలను వైసీపీ వెంటాడింది. ముఖ్యంగా టిడిపి నేతలపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపై ఏకంగా ఆధారాలు లేకుండా సిఐడి కేసులు నమోదు చేసింది. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచింది. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న చంద్రబాబును జైలుకు పంపించారు జగన్. చంద్రబాబు పైనే కాదు దాదాపు తెలుగుదేశం పార్టీ నేతలు అందరి పైన కేసులు నమోదయ్యాయి. యువనేత లోకేష్ ను సైతం అప్పట్లో వెంటాడారు. అదే సమయంలో సాక్షి సైతం లోకేష్ పైతప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో సాక్షిపై పోరాటం మొదలుపెట్టారు లోకేష్. తన పరువు కి భంగం కలిగించారంటూ సాక్షిపై ఏకంగా 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేశారని.. ప్రజల్లో తన పరువుకి భంగం కలిగించారని.. తన హోదాని తగ్గించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ వేశారు.

* బిజీగా ఉన్నా విచారణకు హాజరు
అయితే మంత్రి పదవిలో ఉన్న లోకేష్ బిజీగా ఉన్నారు. కానీ ఈ పరువు నష్టం దావా కేసును సీరియస్ గా తీసుకున్నారు. తానే స్వయంగా విచారణకు హాజరవుతున్నారు. అందులో భాగంగా నిన్న విశాఖ కోర్టుకు వచ్చారు లోకేష్. తన మీద వచ్చిన తప్పుడు ప్రచారం చేస్తూ దానిని నిజం చేయాలని సాక్షి పత్రిక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుందని.. అందుకే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరుతున్నారు.

* 2019లో కథనం
‘చినబాబు తిండికి 25 లక్షలు అండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షిలో ఒక కథనం వచ్చింది. అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేష్ కార్యాలయంలో చిరుతిళ్లు పేరుతో 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారన్నది ఈ కథనం సారాంశం. అప్పట్లో ఇది వైరల్ అంశం గా మారింది. దీనిని ఖండిస్తూ లోకేష్ ప్రకటన జారీ చేశారు. అక్కడకు మూడు రోజుల తర్వాత అంటే 25న సాక్షి దినపత్రికకు నోటీసులు కూడా పంపారు. దీనిపై స్పందించిన సాక్షి అదే ఏడాది నవంబర్ 10న సమాధానం పంపింది. దీనిపై సంతృప్తి చెందని లోకేష్ ఆ సంస్థ పై పరువు నష్టం దావా వేశారు. దురుద్దేశంతోనే ఈ కథనం ప్రచురించారని ఆరోపిస్తూ విశాఖ కోర్టులో పిటిషన్ వేశారు. అప్పటినుంచి తరచూ విచారణకు స్వయంగా హాజరవుతున్నారు లోకేష్. మొత్తానికైతే సాక్షిపై గట్టి పోరాటమే చేస్తున్నారు లోకేష్. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.